కలెక్టర్ గ్రీవెన్స్‌కు 92 అర్జీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికకు సోమవారం 92 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారులు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తంలో వినతుల్లో రెవెన్యూ 40, మున్సిపల్ కార్పొరేషన్ 11, పంచాయతీరాజ్ 9, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రోవర్టీ 4, ఏపీఈపీడీసీఎల్ 4, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ 6, హౌసింగ్ 2, పౌర సరఫరాల శాఖ 2, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 2, నైపుణ్యాభివృద్ధి 2, మైన్స్ అండ్ జియాలజి, వక్ఫ్ బోర్డు, ఆర్టీసీ తదితర శాఖల ఒక్కొక్కటి చొప్పున అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
● కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి భరోసా కల్పించాలని కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలమల రమణ, పోలాకి ప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.చంద్రరావు, కె.మోహన్‌రావు వినతిపత్రం అందించారు.
● ఎచ్చెర్ల మండలం ముద్దాడ కొత్తపేట గ్రామాలకు, అనుబంధ గ్రామాలకు లింక్ రోడ్లు వేయాలని స్థానికులు కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో ముద్డాడ, కొత్తపేట, రుప్పపేట, సెగిడిపేట తదితర గ్రామాల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.


