ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే
శ్రీకాకుళం అర్బన్: కాశీబుగ్గ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షలు చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద కాశీబుగ్గ ఘటనలో చనిపోయినవారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు. ఇందులో రాజకీయాలు చూడకూడదని, మానవతా దృక్పథంతో ఆలోచించాలని, మీరిచ్చే డబ్బులు లేదా మేమిచ్చే డబ్బులు వల్ల బాధిత కుటుంబాలను ఆదుకోలేమని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నిధుల నుంచి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రధాని కూడా రూ.2లక్షలు ప్రకటించారని, చంద్రబాబు కూడా ప్రకటించిన రూ.15లక్షలకు మరో రూ.10లక్షలు ప్రకటించాలని పార్టీ తరఫున విన్నవిస్తున్నామ ని అన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ తదితరులు మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా పాలన సాగిస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో హిందూ దేవాలయాలకు, భక్తులకు భద్రత లేకుండా పోయిందన్నా రు. ఈ కొవ్వొత్తుల ర్యాలీకి ముందుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ బ్యానర్ ఉందని, దీన్ని తీసివేయాలని చెబుతూ శ్రీకాకుళం 2వ పట్టణ సీఐ ఈశ్వరరావు ఆ బ్యానర్‌ను తీసుకున్నారు. అయితే ధర్మాన కృష్ణదాస్ వచ్చి సీఐతో మాట్లాడినప్పటికీ ఆ బ్యానర్ సీఐ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ బ్యానర్‌లో ఏం తప్పు ఉందో చూపాలని సీఐను కృష్ణదాస్ నిలదీయగా అటు తర్వాత బ్యానర్‌ను సీఐ ఇచ్చారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నాయకులు కిల్లి వెంకట సత్యన్నారాయణ, మామిడి శ్రీకాంత్, ఎంవీ పద్మావతి, అంధవరపు సూరిబాబు, గొండు రఘురాం, ఎన్ని ధనుంజయరా వు, ముంజేటి కృష్ణ, బొడ్డేపల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు.


