శ్వేతపుష్కరిణిలో రసాయనాలు
● కూర్మనాథాలయంలో అపవిత్రమైన సంఘటన
గార: పవిత్ర శ్రీకూర్మనాథాలయంలోని శ్వేతపుష్కరిణిలో చేపల కోసం రసాయనాలు కలుపుతుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ శ్వేత పుష్కరిణిలో లక్ష్మీదేవి విగ్రహం లభ్యమైందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ పుష్కరిణిలో దక్షిణం వైపు పిండప్రదానాలు జరుగుతుంటాయి. గతంలో పనిచేసిన ఈఓ, 2024 లో మూడేళ్లు చేపల పెంపకానికి స్థానిక కండ్రపేట మత్స్యకార సొసైటీకి ఏడాదికి రూ.75 వేలు ఆలయానికి చెల్లించాలని, పుష్కరిణిలోని నాచు తొలగించడం వంటి నిబంధనలతో లీజుకిచ్చారు. వీటిలో చేపల పెరుగుదల సహజంగా జరగాల్సి ఉన్నా, వీటిని కాపాడుకునేందుకు రసాయనాలు కలుపుతుండటం చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో థర్మాకోల్ షీట్ల ద్వారా ఇద్దరు వ్యక్తులు పుష్కరిణి నీటిలో రసాయనాలు కలుపుతున్న ఫొటోలు వైరలవుతున్నాయి. కేవలం పసుపు, సున్నం మాత్రమే వేస్తున్నామని లీజుదారులు చెబుతున్నా, రాత్రి వేళలో కలుపుతుండటంతో అనుమానాలు కలుగజేస్తోంది. అదేవిధంగా చేపలు పెరుగుదల కోసం బ్రాయిలర్ కోడి చెత్తను కూడా వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన పుష్కరిణి నీటిని రసాయనాలు, వ్యర్థాలతో పాడు చేస్తున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ కె.నరసింహనాయుడు వద్ద ప్రస్తావించగా ఈ విషయం తన దృష్టికి శుక్రవారం వచ్చిందని, వెంటనే లీజుదారులు, అందుబాటులో ఉన్న పాలకమండలి సభ్యులతో సమావేశం జరిపామన్నారు. ఇకపై ఇలాంటి ఘటన లు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు.


