అర్ధరాత్రి అంగన్‌వాడీ భవనం కూల్చివేత
● కొంచాడలో ఘటన
● పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
పొందూరు: మండలంలోని కొంచాడ గ్రామంలోని అంగన్‌వాడీ భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి కూల్చేశారు. అంతేకాకుండా భవనం ఉన్న ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. గురువారం సాయంత్రం వరకు కనిపించిన అంగన్‌వాడీ కేంద్రం శుక్రవారం ఉదయానికి అక్కడ లేకపోవడంతో అంతా అవాక్కయ్యారు. బిల్డింగ్ కూ ల్చేసిన తర్వాత శిథిలాలు కూడా కనిపించకుండా తరలించుకుపోయారు. ఎవరు చేశారో..? ఎందుకు చేశారో..? తెలియని పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులంతా ఆందోళన చెందారు. గ్రామంలోని సర్వే నంబర్ 45లో 22, ఎల్‌పీఎం నంబర్ 953లో అంగన్‌వాడీ కేంద్రం ఉంది. దశాబ్దాలుగా వినియోగంలో ఉంది. ఈ కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో 2023లో గ్రామంలోని ప్రైవేటు ఇంటిలోకి కేంద్రాన్ని మార్చారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగించాలని ఐసీడీఎస్ అధికారులు ఉన్నతాధికారులకు అర్జీ పెట్టుకున్నారు. సంబంధించిన నివేదికలను అందించా రు. అక్కడే నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతలో రాత్రికి రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, వీఆర్‌ఓ ప్రకాశరావులు కూల్చివేసిన అంగన్‌వాడీ కేంద్రం ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


