పెట్టింది తిను..అదే మెనూ!
చర్యలు తీసుకుంటాం..
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ఇష్టారాజ్యంగా డైట్
● అధికారుల పర్యవేక్షణ లోపం.. రోగులకు శాపం
టెక్కలి రూరల్ : ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన్ పరిషత్ టెక్కలి జిల్లా ఆస్పత్రిలో రోగులకు నిత్యం పెట్టే భోజనాలకు సంబంధించి మెనూ సక్రమంగా పాటించడం లేదని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అంతా తమ ఇష్టమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ప్రతి రోజు ఉప్మా పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఎవరైనా అడిగితే నచ్చితే తినండి లేదంటే బయటకు వెళ్లి తెచ్చుకోండి అంటూ దురుసుగా సమాధానం చెబుతున్నారని పలువురు వాపోతున్నారు. మార్కెట్‌లో ఏది తక్కువ రేటుకు దొరికితే అదే కూరగాయలు తీసుకొచ్చి మెనూకు విరుద్ధంగా వండి పెడుతున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ప్రతిరోజు రెండు పూటలా గుడ్లు పెట్టాలని చార్టులో పేర్కొన్నా.. ఒక్కపూటే గుడ్డు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందొచ్చిన వారికే భోజనం..
ఆస్పత్రిలో ప్రతిరోజూ సుమారు 30 మంది రోగులకు భోజనాలు పెట్టాల్సి ఉంది. అయితే 20 మందికి మాత్రమే వండుతున్నారని, ఎవరు ముందు ఉంటే వారికే భోజనాలు పెట్టి మిగిలిన వారికి లేవనే సమాధానం చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రసూతి విభాగంలో ఉండే బాలింతలకు పూర్తిస్థాయిలో భోజనాలు పెట్టకపోవడంతో వారి బంధువులు ప్రశ్నించారు. ముందు వచ్చిన వారికే భోజనాలు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. గట్టిగా ప్రశ్నించడంతో చివరకు మళ్లీ వండి పెట్టారు.
పర్యవేక్షణ కరువు..
నిత్యం రోగులకు పెట్టే భోజనాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్, హెడ్ సిస్టర్స్‌ల పర్యవేక్షణ లేకుండాపోతోంది. అందుకే డైట్ నిర్వాహకులు వారికి నచ్చినట్లు వండుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెనూలో రోజుకో రకం వండి పెట్టాలని ఉన్న అవి రాతలుగానే మిగిలిపోతున్నాయి. వండిన వంటలు కూడా రుచిగా ఉండటం లేదని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మెనూ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు వాపోతున్నారు.
ఆస్పత్రిలో ప్రతి రోజు ఉదయం టిఫిన్‌గా ఉప్మా పెడుతున్నారు. రోజుకొక రకం అందించాలని చార్టులో ఉన్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. అరకొరగా భోజనం అందించడంతో అర్ధాకలితోనే ఉండాల్సిన పరిస్థితి.
– టి.మాణిక్యం, రోగి సహాయకులు, తర్లిపేట
ఆస్పత్రి మెనూ ప్రకారం వంటకాలు చేయాల్సి ఉన్నా డైట్ సిబ్బంది అనుసరించడం లేదు. నిత్యం వండి పెట్టే భోజనాలు ఎలా ఉన్నాయనే దానిపై సంబంధిత సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. – కన్నా బెహరా,
ఇన్‌పేషెంట్, ఆకాశలక్కవరం
ఆసుపత్రిలో రోగులకు డైట్ సక్రమంగా అమలు కావడం లేదనే విషయం మా దృష్టికి రాలేదు. ఇకపై ఆ తప్పు జరుగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతి రోజు పరిశీలించి మెనూ ప్రకారం భోజనాలు పెట్టేవిలా చర్యలు తీసుకుంటాం.
– బొడ్డేపల్లి సూర్యారావు,
టెక్కలి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్
పెట్టింది తిను..అదే మెనూ!
పెట్టింది తిను..అదే మెనూ!
పెట్టింది తిను..అదే మెనూ!


