బాబోయ్‌ దొంగలు! | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ దొంగలు!

Nov 1 2025 7:52 AM | Updated on Nov 1 2025 7:52 AM

బాబోయ్‌ దొంగలు!

బాబోయ్‌ దొంగలు!

బాబోయ్‌ దొంగలు!

బయటి దొంగల పనే..

వరుస చోరీలతో రెచ్చిపోతున్న దుండగులు

ముఖ్య కూడళ్లలో పనిచేయని సీసీ కెమెరాలు

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. క్లూస్‌, సాంకేతిక ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రాపర్టీ నేరాలను అరికడుతున్నామన్న ఎస్పీ చెబుతున్నా జిల్లా పోలీసులకు వరుస చోరీలతో గజదొంగలు సవాల్‌ విసురుతున్నారు. ఫింగర్‌ ప్రింట్‌, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్సు, జిల్లాలో కొన్ని స్టేషన్ల అధికారులు మాత్రమే సాంకేతికంగాను, ఇతర ఆధారాలతోనూ కేసులు ఛేదిస్తున్నారు. అయినప్పటికీ చాలావరకు కేసులు పెండింగ్‌లో ఉండిపోవడాన్ని ఎస్పీ ప్రస్తావిస్తున్నారు. సమీక్ష సమావేశాల్లో ట్రాక్‌రికార్డు బాగాలేని అధికారులను గట్టిగానే హెచ్చరిస్తున్నా ఫలితం ఉండటం లేదు.

ఏవీ సీసీ కెమెరాలు..?

దొంగలని పట్టడంలో అత్యంత కీలకమైన సీసీ ఫుటేజీ కెమెరాలు జిల్లావ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్నవి కూడా పూర్తిగా మరమ్మతులైనవే. దాదాపు 1500 సీసీ కెమెరాలు కావాల్సివున్నా.. 900 మాత్రమే ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని కోర్టు వెనుక చినబొందిళీపురం, పీఎన్‌కాలనీ, బ్యాంకర్స్‌ కాలనీ, ఇందిరానగర్‌, న్యూకాలనీల్లో ఎటువంటి క్రైమ్‌ జరిగినా ఆ కేసు సంవత్సరాలు పట్టే రీతిలో ఉన్నాయి. పీఎన్‌కాలనీ పదోలైన్‌లో ఉపాధ్యాయుల ఇంట్లో గతేడాది అక్టోబరులో చోరికి గురైన 13 తులాలు ఈ కోవకే వస్తాయి. అక్కడికి కొద్ది దూరంలోనే మరో ఇంట్లో రూ. 6 లక్షలు చోరీకి గురయ్యాయి. అక్టోబరులో చోరీ జరిగితే జనవరిలో సీసీఫుటేజీలో చోరీ చేసిన వ్యక్తి కనపడ్డాడు. కాశీబుగ్గ, నరసన్నపేట, టెక్కలి, కంచిలి, సోంపేట వంటి ప్రాంతాలదీ ఇదే పరిస్థితి. సీఎస్‌ఆర్‌, పోలీసింగ్‌ ఫండ్సే కాక ప్రజలే దాతలై ఇస్తే సీసీ కెమెరాలు మొత్తానికి పెట్టొచ్చులే అన్నచందంగా అటు కూటమి ప్రభుత్వం, ఇటు పోలీసులు వ్యవహరిస్తున్నారు.

ఎస్పీ ఏమన్నారంటే..

ఇటీవల జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రాపర్టీ నేరాలపై గట్టిగానే హెచ్చరించారు. పెండింగ్‌ కేసులపై ఆ పరిధి పోలీస్‌స్టేషన్‌లే కాక అందరినీ భాగస్వామ్యులుగా చేస్తూ ప్రత్యేక బృందాలుగా విడిపోయి కేసులను ఛేదించాలని ఆదేశించారు. నేరస్థుల కదలికలపై పూర్తి నిఘా పెట్టాలని, రాత్రి పూట బీట్‌ వ్యవస్థ మెరుగవ్వాలని, చెక్‌పోస్టుల్లో ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు.

ఈ ఏడాది జులైలో కంచిలిలో రిటైర్డ్‌ లెక్చరర్‌ ఇంట్లో 25 తులాలు, కిలో వెండి ఆభరణాలు కొట్టేసిన వారిలో ఓ హిజ్రాతో పాటు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు చెందిన మరో నలుగురున్నారు. 12.3 తులాలే రికవరీ కాగా హిజ్రా పట్టుబడింది. వీరందరిపై లెక్కకు మించి కేసులున్నాయి.

గార మండలం మత్స్యలేశం–కళింగపట్నం పోర్టు వరస ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు కాకినాడ వాసులు ఇటీవలే 186 గ్రాముల బంగారం, 283 గ్రాముల వెండితో పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరిపై 25కి పైగా కేసులు, ఒకరిపై హత్యాయత్నం కేసుంది.

ఇదే నెల 10న వివిధ జిల్లాలకు చెందిన ట్రాన్స్‌జెండర్లు నరసన్నపేటలో పలు ఛైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. సాలూరు, విశాఖలకు చెందిన నేరగాళ్లు రూ. లక్షల విలువైన బుల్లెట్ల చోరీకి పాల్పడ్డారు.

తాజాగా కాశీబుగ్గలోని నాలుగు మెడికల్‌ షాపుల్లో దాదాపు రూ. 6 లక్షల వరకు నగదు చోరీ చేశారు.

సారవకోట మండలం బుడితిలో ఓ వృద్ధురాలిపై దాడి చేసి బంగారాన్ని కాజేశారు.

ఏపీలో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దున్న కృష్ణ. దాదాపు 200కు పైగా చోరీలు చేశాడు. కాళ్లు విరిగి నడవలేడనుకున్నవాడే గత ఆరుమాసాలుగా పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ కొరకరాని కొయ్యగా మారాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement