నేడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని శనివారం విజయవంతం చేయాలని శ్రీకాకుళం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం ఫలితంగా ఏర్పడినదే ఆంధ్ర రాష్ట్రమని, అమరజీవిని స్మరించుకుంటూ పాతబస్టాండ్ కూడలిలో ఉదయం 10.30 గంటలకు జరిగే కార్యక్రమానికి పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తదితరు హాజరవ్వనున్నట్లు తెలిపారు.
ప్రొవిజినల్ మెరిట్‌లిస్ట్ సిద్ధం
శ్రీకాకుళం: శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల సర్వజన ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును సిద్ధం చేసినట్లు ప్రిన్సిపాల్ శుక్రవారం తెలిపారు. వెబ్‌సైట్లో నవంబర్ 4 వరకు జాబితా అందుబాటులో ఉంటుందని, అభ్యంతరాలు ఉంటే అదే తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. అనంతరం తుది మెరిట్ జాబితా వెల్లడిస్తామని పేర్కొన్నారు.
స్కిల్‌హబ్ సెంటర్‌లో ఉచిత శిక్షణ
ఎచ్చెర్ల: ఎచ్చెర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఐటీఐ స్కిల్‌హబ్ సెంటర్‌లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు శుక్రవారం తెలిపారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ మాన్యూవల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన 18 నుంచి 30 ఏళ్లలోపు యువకులు అర్హులని తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్‌తో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా ధ్రువపత్రాలతో నవంబర్ 10లోపు స్కిల్‌హబ్ సెంటర్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7989177887 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.
రూ.33 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ విభాగం విద్యార్థి ఎం.వి.వి.కె.రాఘవన్ ప్రఖ్యాత సర్వీస్ నౌ ఐటీ కంపెనీలో రూ.33.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికై నట్లు కాలేజీ డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాఘవన్‌ను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.సంతోష్‌కుమార్, సీఎస్‌డీ డీన్ టి.నరేష్, ప్లేస్‌మెంట్ డీన్ ఎం.సంతోష్‌కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ హెచ్‌ఓడీ శ్రీకాంత్ పాల్గొన్నారు.
రేపు బీసీ ఉద్యోగుల సమావేశం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): బీసీ/ఓబీసీ ఎంప్లాయిస్ అసోషియేషన్ సమావేశం ఈ నెల 2న శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించనున్నట్లు సంఘ నాయకులు శుక్రవారం తెలిపారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం, పి.భూషణరావు, స్టేట్ జనరల్ సెక్రటరీ వై.శంకరరావు, స్టేట్ ట్రజరర్ కొణతాల గణేష్, జిల్లా అధ్యక్షుడు అనకాపల్లి, బి.వి.వరప్రసాద్, ఎన్నికల అధికారి పి.రామచంద్రరావు హాజరవుతారని పేర్కొన్నారు. బీసీ /ఓబీసీ ఉద్యోగులంతా హాజరుకావాలని కోరారు.


