చోరీ కేసు నిందితులు అరెస్టు
సారవకోట: మండలంలోని బుడితి గ్రామంలో నక్క చెల్లెమ్మ(78) అనే వృద్ధురాలిపై అక్టోబర్ 27న రాత్రి జరిగిన దాడి, దొంగతనం కేసును సారవకోట పోలీసులు ఛేదించారు. శుక్రవారం సారవకోట పోలీసుస్టేషన్లో నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. చీడిపూడి గ్రామానికి చెందిన రావాడ దేవీప్రసాద్(19), జలుమూరు మండలం నామాలపేటకు చెందిన తియ్యాల గోపి(19) చెడు వ్యసనాలకు బానిసయ్యారు. ఈ క్రమంలో దేవీప్రసాద్ అక్టోబర్ 27న రాత్రి ఒంటరిగా ఉన్న నక్క చెల్లెమ్మ ఇంట్లో చొరబడి ఆమె ముక్కు, చెవిలో ఉన్న అరతులం బంగారం దొంగిలించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఇనుప చువ్వతో మెడపై గాయపర్చాడు. బయట నుంచి ఎవ్వరూ రాకుండా గోపి కాపాలా కాశాడు. చోరీ చేసిన బంగారంతో ఇద్దరు పరారయ్యారు. గాయపడిన చెల్లెమ్మను మరుసటిరోజు స్థానికులు గమనించి బుడితి సీహెచ్‌సీలో చేర్పించి చికిత్స చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్‌ఐ అనిల్‌కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం బొంతు జంక్షన్‌లో వీరిద్దరూ ఉన్నారని సమాచారం రావడంతో వెళ్లి పట్టుకున్నారు. ఇద్దరిపైనా చోరీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్‌ఐ, సిబ్బందిని సీఐ అభినందించారు.


