ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి పంచాయతీ నర్శింగపల్లి సమీప తోటలో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు పెద్దబమ్మిడి పంచాయతీ నిమ్మాడ జంక్షన్ వద్ద కాలనీకి చెందిన బలివాడ మోహన్(45)గా గుర్తించారు. ఈయన కొద్ది సంవత్సరాలుగా భార్యాపిల్లలతో కలిసి శ్రీకాకుళంలో కొత్త రోడ్డులో కిరాణా షాపు నడుపుతున్నాడు. గురువారం నిమ్మాడలోని తన అన్నయ్య తిరుపతి ఇంటికి వచ్చాడు. వదినకు డబ్బులు, తాడు అడగ్గా.. లేదని సమాధానం చెప్పడంతో జలుమూరు మండలం కొండకామేశ్వరిపేటలోని చెల్లి జ్యోతి ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం నర్శింగపల్లి గ్రామ సమీప తోట వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీ కూలీలు మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య హేమలత, కుమార్తె ఉన్నారు. మోహన్ మృతికి గల కారణాలు తెలియాలేదు. కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


