టీచర్లకు టెట్ టెన్షన్
ప్రభుత్వ నోటిఫికేషన్‌తో ఉపాధ్యాయులు గరంగరం ఏళ్ల తరబడి బోధన చేస్తుంటే ఇప్పుడు పరీక్షలేంటని ప్రశ్న జిల్లాలో 9300 మందిపై ప్రభావం
మినహాయించాలి..
పిటిషన్ వేయాలి..
అన్యాయం..
నరసన్నపేట:
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) టెన్షన్ నెలకొంది. సర్వీసులో కొనసాగుతున్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత కావాల్సిందే నని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యూకేషన్ కూడా టెట్ తప్పనిసరి అని పేర్కొంది. ఈ దశలో ప్రభుత్వం ఈ నెల 23న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గాలు గరంగరంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారంతా ఈ వయసులో ఇదేం బాధ బాబూ.. అంటూ తలలు పట్టుకుంటున్నారు. 2010 నుంచి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిందని, అంతకుముందు నుంచి ఉన్న టీచర్లకు టెట్‌ను తప్పనిసరి చేయడమేంటని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లు లోపు పదవీ విరమణ పొందనున్న వారికి టెట్ నుంచి మినహాయింపు నిచ్చారు. అయి తే ఈ ఐదేళ్లలో పదోన్నతి కావాలంటే మాత్రం టెట్ రాయకతప్పదని అదికారులు అంటున్నారు. దీంతో ఉపాద్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 14300 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 2011 తరువాత నియమితులైన వారు సుమారు 3 వేల మంది ఉన్నారు. వీరందరూ టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారే. ఐదేళ్ల లోపు పదవీ విరమణ పొందనున్న వారు వెయ్యి మంది వరకూ ఉన్నట్లు సమాచారం. వీరు మినహా మిగిలి న ఉపాధ్యాయులంతా విధిగా టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అదికారులు చెబుతున్నారు. ఎస్‌జీటీలు ముందుగా టెట్ పేపర్–1 రాయాల్సి ఉంది. పదోన్నతి కావాల నుకునే వారు పేపర్–2 రాయాలి. స్కూల్ అసిస్టెంట్లు పేపరు –2 తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయవర్గాల అభ్యంతరం..
టెట్‌కు సంబంధించి నవంబర్ 23 వరకూ ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో సూచించింది. కాగా టెట్‌ను తప్పనిసరి చేయడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. టీటీసీ, బీఈడీ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఉద్యోగాలకు ఎంపికయ్యామని, ఏళ్ల తరబడి విధుల్లో ఉన్నామని, ఇప్పుడు తమకు పరీక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రభుత్వం అంటోందని, అలాగైతే విద్యా హక్కు చట్టం అమలుపై సుప్రీం కోర్టు అనేక ఉత్తర్వులు ఇచ్చిందని, అవన్నీ ఎందుకు అమలు చేయడం లేద ని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
2010 ముందు ఉద్యోగంలో చేరిన వారికి టెట్ నుంచి మినహయింపు ఇవ్వాలి. నేను 1995లో విధుల్లో చేరాను. 30 సంవత్సరా ల సర్వీసు పూర్తయింది. ఇప్పుడు పరీక్షలు పాస్ కావాలంటే ఎలా? ఇది మమ్మల్ని అవమానించడం కిందకే వస్తుంది. అప్పట్లో నేను టీటీ సీ పూర్తి చేసి డీఎస్సీ ద్వారా ఎంపికై సెకండరీ గ్రేడ్ టీచర్‌గా జాయినయ్యాను. ప్రభుత్వం సు ప్రీంకోర్టులో పిటిషన్ వేసి మాలాంటి ఉపాధ్యాయులకు పరీక్ష నుంచి మినహాయింపు తేవాలి.
– నడిమింటి అప్పలనాయుడు,
సత్యవరం స్కూల్ హెచ్‌ఎం
టెట్ వ్యవహరంపై ప్రభు త్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. అపీలు పిటిషన్ వేయాలి. పొరుగు రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. టెట్ రాయడం బోధనా సమయం తగ్గించడమే తప్ప మరే ప్రయోజనం లేదు. సంఘ పరంగా కోర్టుకు వెళ్లాం. ప్రభుత్వం పునరాలోచించాలి. శుక్రవారం అన్ని జిల్లాల్లో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇస్తున్నాం. – బమ్మిడి శ్రీరామమూర్తి,
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
30 ఏళ్లకు పైగా సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు సై తం ఇప్పుడు టెట్ పరీక్షలు పెట్టడం దారుణం. కోర్టు ఆదేశాలుల పేరుతో 2010 ముందు జాయిన్ అయిన ఉపాధ్యాయు లు అందరికీ టెట్ పరీక్ష తప్పనిసరి చేయడం శోచనీయం. నాకు 28 ఏళ్లు సర్వీసు పూర్తి అయింది. ఇప్పుడు పరీక్షలంటే ఎలా..?
– బి.కేశవరావు,
ఏపీటీఎఫ్ (1938) మండల అధ్యక్షుడు
టీచర్లకు టెట్ టెన్షన్
టీచర్లకు టెట్ టెన్షన్
టీచర్లకు టెట్ టెన్షన్


