పెచ్చులూడుతున్నా పట్టించుకోరా?
● అధ్వానంగా రిమ్స్ భవనాలు ● బిక్కుబిక్కుమంటున్న సిబ్బంది, రోగులు ● స్పందించని అధికారులు
శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల కు అనుబంధంగా ఉన్న సర్వజన ఆస్పత్రిలో భవనాల పెచ్చులు ఊడిపడిపోతున్నాయి. రెండు రోజు ల క్రితం సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పెచ్చులు పడి పన్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటిని తొలగించే వారే కరువయ్యారు. సూపరింటెండెంట్ కార్యాలయంతో పాటు నర్సింగ్ సూపరింటెండెంట్ కార్యాలయం కూడా ఇదే మార్గంలో ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాత భవనాలకు కొత్త భవనాలను ఇక్కడ అనుసంధానం చేసి ఉండటంతో అవి సరిగ్గా కలవకపోవడంతో ఇటువంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు రిమ్స్ వర్గాలు చెబు తున్నాయి. ఇదే ప్రాంతంలో మరొక చోట కూడా పెచ్చులూడి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని, దీన్ని కూడా తొలగించుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. ఈ దారిలో వైద్య సిబ్బందితో పాటు రోగులు, సహాయకులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తరచూ సెలవులో ఈఈ..
రిమ్స్‌లోని ఇంజినీరింగ్ పనులను పర్యవేక్షిస్తున్న ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీడీ ఈఈగా వ్యవహరిస్తున్న ప్రమోద్‌కుమార్ తరచూ సెలవులో ఉంటున్నారు.గత నెల 30న సత్య ప్రభాకర్ పదవీ విరమణ చేయడంతో విశాఖపట్నం క్వాలిటీ కంట్రోల్లో డీఈఈగా పనిచేస్తున్న ప్రమోద్‌కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలతో శ్రీకాకుళంలో ఈఈగా నియమించా రు. విధుల్లో చేరిన వారం తర్వాత సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ బాధ్యతపై అయిష్టత వ్యక్తం చేస్తూ ప్రధాన కార్యాలయానికి లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉండగా, ప్రమోద్‌కుమార్ తరచూ సెలవులో వెళ్లిపోతున్నారు. ఈనెల 15 నుంచి 26 వరకు అనారోగ్య సమస్యలు అంటూ సెలవు పెట్టిన ఆయన తిరిగి వీధిలో చేరకుండానే నవంబర్ 5 వరకు సెలవు పొడిగించారు. రిమ్స్ కళాశాలకు గానీ, ఆస్పత్రిలో గానీ ఏవైనా మరమ్మతులు చేయించాలన్నా పనులు పూర్తి చేయాలన్నా, మందులు కావాలన్నా ఈఈ సంతకం చేయాల్సి ఉంటుంది. ఈయన అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం డీఈగా వ్యవహరిస్తున్న సిమ్మన్న సంతకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పెచ్చులూడుతున్నా పట్టించుకోరా?


