 
															దరఖాస్తుల గడువు పెంపు
శ్రీకాకుళం రూరల్: బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్‌కేర్ కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును నవంబర్ 2 వరకు ఎన్టీఆర్ వైద్య, ఆరోగ్య విశ్వ విద్యాలయం పెంచిందని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని బైపీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. మరిన్ని వివరాలకు 76809 45357, 91219 99654 నంబర్లను సంప్రదించాలన్నారు.
ఆర్మీ జవాన్ మృతి
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బైరి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ వెంపటాపు రాజు (33) కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ మృతి చెందాడు. అక్కడ చలి తీవ్రత కారణంగా గుండెపోటు రావడంతో వెంటనే డిల్లీలో ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
పాముకాటుతో తీవ్ర అస్వస్థత
టెక్కలి రూరల్: మండలంలోని అంజనేయపురం గ్రామ సమీపంలో ఉన్న ఒక క్వారీలో పనిచేస్తున్న వ్యక్తికి పాము కాటువేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్థాన్‌కు చెందిన నిఖిల్ అనే వ్యక్తి క్వారీలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. అది గుర్తించిన తోటి కార్మికులు ఆ వ్యక్తిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
పేకాటరాయుళ్లు అరెస్టు
శ్రీకాకుళం రూరల్: మండల పరిధి కుందువానిపేట గ్రామంలోని రచ్చబండ వద్ద బుధవారం పేకాడుతున్న 11 మందిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి రూ.7,250 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
నాగుపాము హల్‌చల్
నరసన్నపేట: స్థానిక కలివరపుపేటలోని సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం నాగుపాము హల్‌చల్ చేసింది. ఆలయం లోపలి గోడల వద్ద చాలా సమయం ఉంది. ఆలయ గర్భగుడి వైపునకు వెళ్లేందుకు పాము ప్రయత్నించగా.. భక్తులు గమనించి బయటకు తరలించారు.
ముంపు పంటల పరిశీలన
ఇచ్ఛాపురం రూరల్: మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు బాహుదా నది పరివాహక ప్రాంతంలో సుమారు 1,118 హెక్టార్ల వరిపంట నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. బుధవారం రాగోలు వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త డాక్టర్ కె.ఉదయ్‌బాబు, ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్తవేత్తలు డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్‌లు తులసిగాం, ఇన్నేశుపేట, డొంకూరు, ఈదుపురం, జగన్నాథపురం, రత్తకన్న, బెల్లుపడ గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించారు. పంట పొలాల్లో వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత యూరియా, ఎంవోపీ ద్రావణాన్ని పిచికారీ చేయాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. పంట నష్టం, తీవ్రతను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందన్నారు. వారితో పాటు సోంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకుడు భవానీశంకర్, మండల సీనియర్ వ్యవసాయాధికారి పీపీవీవీ అజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
 
							దరఖాస్తుల గడువు పెంపు
 
							దరఖాస్తుల గడువు పెంపు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
