 
															ఏదీ ఉచిత రేషన్..
● తుఫాన్ బాధితులకు
అందని రేషన్
● ప్రభుత్వ హామీ ప్రకటనకే పరిమితం
ఇచ్ఛాపురం రూరల్: మోంథా తుఫాన్ బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బాధిత మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం, సాధారణ కుటుంబాలకు 25 కిలోల బి య్యం, ఒక కిలో కంది పప్పు, లీటర్ మంచి నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెరను తక్షణం తుఫాన్ ప్రాంతంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు ఆదే శాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నేటికి మూడు రోజులవుతున్నా తమకు ఎలాంటి సరుకులు అందలేదని బాధిత కుటుంబా లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇచ్ఛాపురం మండలంలో తుఫాన్ ప్రభావిత పంచాయతీ బూర్జపాడులో మత్స్యకారులకు చెందిన 541 రేషన్ కార్డులు, 1048 ఇతరుల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని బాధితులకు నిత్యావసర సరకులు ఇస్తున్నట్లు గురువారం ప్రకటించడంతో కార్డుదారులు రేషన్ దుకాణాలకు ఆశగా వెళ్లారు. కానీ ప్రస్తుతానికి నవంబర్‌కు సంబంధించి బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నామని, ఉచిత సరుకులపై తమకు ఎలాంటి ఆదేశాలు, సరుకులు రెండూ రాలేదని డీలర్లు తెలిపారు. దీంతో బాధితులకు నిరాశ తప్పలేదు. గురువారం సాయంత్రం నవంబర్ నెలకు సంబంధించి నిత్యావసర సరుకులు ఇస్తుండగా, ఈ–పాస్ మిషన్‌లో ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి 50 కేజీల బియ్యం, పప్పు, నూనె, ఉల్లి, బంగాళాదుంపలు ఇస్తున్నట్లు మెసేజ్ రావడంతో రేషన్ డీలర్లు అవాక్కయ్యారు. ఇంకా తమకు రాని ఉచిత సరుకులను ఎలా ఇవ్వాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. దీంతో 70 శాతం మంది కార్డుదారులకు నవంబర్ నెలకు సంబంధించి సరుకులు అందజేయకుండా రేషన్ దుకాణాలకు తాళాలు వేసేశారు.
జీఓ వచ్చింది గానీ... సరుకులు రాలేదు
తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో ఉన్న మత్స్యకారులకు 50 కిలోల బియ్యం, ఇతరులకు పాతిక కిలోల బియ్యంతో పాటు కిలో చొప్పున పప్పు, నూనె, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఇవ్వాలని సివిల్ సప్లై కమిషనర్ నుంచి జీఓ వచ్చింది. అయితే మాకు సరుకులు మాత్రం రాకపోవడంతో ఇవ్వలేకపోయాం. ఇచ్ఛాపురం మండలం బూర్జపా డు పంచాయతీలో 1,589 కార్డుదారులు ఉండగా, కవిటి మండలానికి సంబంధించి తుఫాన్ ప్రభావిత మత్స్యకార కార్డుదారుల జాబితను మత్స్యశాఖాధికారులు ఇంతవరకు అందివ్వలేదు. సరుకులు వచ్చి న వెంటనే బాధితులకు ఉచితంగా అందిస్తాం.
– కె.సంతోష్,
సివిల్ సప్లై డీటీ, ఇచ్ఛాపురం మండలం
మత్స్యకారులకు ఫ్రీ అన్నారు
తుఫాన్ కారణంగా మత్స్యకారులకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు ఇస్తున్నట్లు మాకు తెలిసి డీలర్ వద్దకు వెళ్తే... మా కార్డుకు పాతిక కిలో బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే ఇచ్చారు. గత వారం రోజులుగా చేపల వేట లేకపోవడంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి. అవసరం ఉన్నప్పుడు ఉచిత సరుకులు ఇచ్చి ఉంటే బాగుండేది. – చింతకాయల పున్నమ్మ,
కార్డుదారురాలు, డొంకూరు
 
							ఏదీ ఉచిత రేషన్..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
