 
															చేజారింది పంటంతా..!
● అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చిన తుఫాన్
● పడిపోయిన పంటను చూసిన
లబోదిబోమంటున్న రైతులు
● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
మూడు రోజులుగా కురిసిన వర్షాలకు నీటిలో మునిగిన పంట పొలాలివి. ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామానికి చెందినవి. దాదాపు 800 ఎకరాలు నీట మునిగాయి. పొలా లు కాస్త చెరువులా తయారయ్యాయి. చేతికొ చ్చిన పంట పూర్తిగా నీట మునగడంతో గింజలు ఉండే పరిస్థితి లేదు. వరి దుబ్బులే మిగులుతాయి. ఇదీ ఇక్కడి రైతుల దయనీయ పరిస్థితి.
చేతికందిన పంట ధ్వంసం
మాకు 80 సెంట్లు భూమి ఉంది. ఈ పొలంలో పండిన పంటే మాకు ఏడాది పొడవునా జీవనాధారం. పండిన ధాన్యాన్ని కొంత మేరకు నిల్వ చేసుకుని మిగిలిన ధాన్యం ఖర్చుల నిమిత్తం విక్రయిస్తుంటాను. మూడు నెలలు నుంచి అన్ని రకాలుగా పంటను కాపాడుకుంటూ వచ్చాను. ఎన్ను బాగా వేసింది. దిగుబడి బాగుంటుంది అనుకుంటున్న సమయంలో తుఫాన్ వచ్చి ముంచేసింది. 30 బస్తాలు పండుతాయనుకుంటే 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పంటను చూడటానికి అధికారులు ఎవరూ రాలేదు. నష్టం గుర్తించాలి.
– మజ్జి గంటడు, సారవకోట
పెట్టుబడి నీటిపాలు
పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయి, మాకు కన్నీరే మిగిలింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందుతున్న సమయంలో నేల కొరిగి నీటి పాలైంది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆర్ధికంగా నష్టపోతాం. మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాం. – నేలకొరిగిన పంటను చూపిస్తున్న పొందల రామారావు, దిమిలాడ, నందిగాం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మోంథా రైతు కంట కన్నీరు తెప్పించింది. చేతికి అందిన పంట నీటి పాలైతే.. కష్టమంతా కళ్ల ముందే మునిగిపోతుంటే.. నాలుగు నెలల కష్టం ఒక్క వర్షానికే నాశనమైపోయిన దృశ్యాలు చూస్తుంటే ఆ రైతుల గుండె తరుక్కుపోతోంది. వేల రూపాయలు పెట్టుబడి, ఆరు గాలం కష్టపడి పండించిన పంట ఒక్క రోజులో నేలమట్టమైతే అన్నదాతలకు గుండె ఆగిపోయినంత పనవుతోంది. ఇప్పుడు జిల్లాలో రైతుల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. పండిన పంట నీట మునగడంతో కర్షకులు కన్నీరుమున్నీరవుతున్నారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. వారి ఆశలపై నీళ్లు జల్లాయి. భారీ వర్షాలు అన్నదాతలకు పిడుగుపాటుగా మారాయి. చేతికి వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కళ్ల ముందు పంట నాశనం కావడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఆపదలో ఉన్న తమను ఆదుకోవాలని, కనీసం పెట్టిన పెట్టుబడైనా సాయం చేయాలని, మానవత్వంతో కూడిన ఆపన్నహస్తం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఒక్క వరి పంటే కాదు.. మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన పంటలు కూడా వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 9వేల ఎకరాల వరి, 87.5ఎకరాలు పత్తి, 62.5ఎకరాలు మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చు. చాలా గ్రామాల్లో, చాలా రైతుల పొలాల వద్దకు అధికారులు ఇంకా రాలేదని, తమ నష్టాన్ని గుర్తించలేదని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే జిల్లాలో 20వేల ఎకరాల వరకు పంటకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. వందలాది ఎకరాల్లో పంట నీట మునగగా, చాలా చోట్ల కంకులు నేలకొరిగాయి. ఉద్యానవన పంటలైతే చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నిబంధనల పేరుతో లెక్కలోకి తీసుకోకపోవడంతో చాలా మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు.
 
							చేజారింది పంటంతా..!
 
							చేజారింది పంటంతా..!
 
							చేజారింది పంటంతా..!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
