 
															పోలీసుల రక్తదానం
శ్రీకాకుళం క్రైమ్ : పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, ఒత్తిడితో కూడుకున్నవని, ఆరోగ్యంపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. పోలీసు అమరవీరుల స్మారకోత్సవంలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ మెగా ఉచిత వైద్యం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా ఎస్పీ వివిధ వైద్య పరీక్షలు చేయించుకుని స్వయంగా రక్తదానం చేసి సిబ్బందిలో స్ఫూర్తి నింపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం ఒక మానవతా సేవ అని, మన రక్తం వేరొకరిని రక్షిస్తుందని, ఏడాదికి ఒకసారైనా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. పోలీసు సిబ్బందికి మెడికవర్ ఆస్పత్రి సౌజన్యంతో వైద్యబృందం ద్వారా రక్తపోటు, షుగర్, కంటి పరీక్షలు, సాధారణ ఆరో గ్య పరీక్షలు నిర్వహించారు. రెడ్‌క్రాస్, జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమం జరిగింది. అనంతరం వారికి ప్రశంసాపత్రాలు అందించారు. అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు.
కూలిన ఇళ్లు
కవిటి: మండలంలోని ఆర్.భైరిపురంలో మోంఽథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు బాగా తడిసిముద్దయిన ఇంటి గోడ కూలింది. గ్రామానికి చెందిన బొర్ర సుందరరావు ఇంటికి తూర్పు భాగంలో ఉన్న గోడ గురువారం ఉదయం కూలింది.
నరసన్నపేట: మండలం ఉర్లాం పశువైద్య కేంద్ర భవనానికి చెందిన గోడ వర్షాలకు కూలింది. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న ఈ పశువైద్య కేంద్ర భవనం గోడ కూలడంతో సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం గోడ కూలిందని సిబ్బంది తెలిపారు.
హిరమండలం: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎల్‌ఎన్‌పేట రోటరీనగర్‌లో ఇల్లు కూలిపోయింది. కలగ అచ్చయ్య అనే వృద్ధుడి ఇంటి గోడ వర్షాలకు నానిపోయింది. బుధవారం రాత్రి పెద్ద శబ్దాలతో గోడ కూలడంతో అచ్చయ్య భయంతో ఇంటి నుంచి పరుగులు తీశారు. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
