మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు
శ్రీకాకుళం : పీపీపీ విధానం పేరిట ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం తగదని జన విజ్ఞాన వేదిక వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రచురించిన ‘పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు’ బుక్‌లెట్‌ను శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్‌లో ప్రజా సంఘాల నేతలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజానీకానికి వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, జీడీపీలో ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి కేతవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమ రంగాల బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. కార్పొరేట్ల దయదాక్షిణ్యాలపై ప్రజా వైద్యం ఆధారపడటం సరికాదన్నారు. కేరళ తరహా ప్రజా వైద్య విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చింతాడ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా జిల్లా నాయకులు కె.నాగమణి, జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.కూర్మారావు, కోశాధికారి వీఎస్‌కుమార్, శివకుమార్, గరిమెళ్ల అధ్యయన వేదిక అధ్యక్షుడు పి.సుధాకర్, రచయిత కంచరాన భుజంగరావు, ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు బాడాన శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.


