
కొర్ని కుర్రాడి ‘పవర్’
● పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తున్నరాజశేఖరరావు
● జాతీయ స్థాయి పోటీల్లో పతకాల కై వసం
గార : సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కుర్రాడు జాతీయ స్థాయిలో ‘పవర్’ చూపిస్తున్నాడు. ఓవైపు ఉద్యోగ సాధనలో నిమగ్నమవుతూనే.. మరోవైపు ఎక్కడ పోటీలు జరిగినా పతకం రావాల్సిందే అన్నట్లుగా ప్రతిభ కనబరుస్తున్నాడు. గార మండలం కొర్ని గ్రామానికి చెందిన చమల్ల రాజశేఖరరావు జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా రాజమండ్రిలో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఓవైపు చదువుతూనే, మరోవైపు వ్యాయామం పట్ల ఆసక్తి ఉండటంతో అక్కడే భారతీయ వ్యాయామ కళాశాలకు వెళ్లి రెండు పూటలా వ్యాయామం చేసేవాడు. అక్కడ వివిధ రకాలైన కోచ్‌ల పరిచయంతో క్రీడాపోటీలకు కూడా శిక్షణ తీసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు స్పోర్ట్సు కోటా కూడా ఉండటంతో ఆసక్తి మరింతగా పెరిగింది. రెండు సంవత్సరాలుగా పలు పోటీల్లో పాల్గొన్న రాజశేఖర్ జాతీయ స్థాయి పోటీల్లో మెరిసాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన నేషనల్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2015 పోటీల్లో ఫుల్‌పవర్ లిఫ్టింగ్, ఫుష్‌పుల్, బెంచ్‌ప్రెస్ మూడు విభాగాల్లో స్వర్ణ పతాకాలు సాధించాడు. గతంలోనూ జంషెడ్‌పూర్‌లో ఇండియన్ పవర్‌లిప్టింగ్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాడు. తూర్పుగోదావరి జిల్లా స్థాయి పోటీలు, రాష్ట్ర చాంపియన్‌షిప్ పోటీల్లో మూడు సార్లు పాల్గొని ప్రథమ స్థానం సాధించాడు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..
చంద్రశేఖర్ పదో తరగతి వరకు కొర్ని హైస్కూల్, ఇంటర్మీడియెట్ గురజాడ, డిగ్రీ ఆదిత్య కళాశాలలో చదివాడు. మావయ్యలు మళ్ల యేగీశ్వరరావు, మళ్ల లక్ష్మీనారాయణల ప్రోత్సాహం, అన్నయ్య చమల్ల కృష్ణారావు, సుమలత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ సూచనలు చంద్రశేఖర్‌కు ఉపయోగపడ్డాయి. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి పోటీల్లో రాణించడంపై గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ పవర్‌లిఫ్టింగ్ రాణించడమే లక్ష్యం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యమైనా, జాతీయ స్థాయి పోటీలతో పాటు అంతర్జాతీయ పోటీల్లో కూడా రాణించాలన్న కోరిక ఉంది. అసోషియేషన్‌లు సహకారం అందించాలి.
– చమల్ల రాజశేఖరరావు,
కొర్ని, గార మండలం

కొర్ని కుర్రాడి ‘పవర్’