
దాతలే దిక్కు..!
పింఛన్ ఇప్పించరూ...!
అరసవల్లి: ఆరేళ్ల క్రితం జరిగిన బస్సు ప్రమాదం ఆ ఇంటి యజమాని కాళ్లను చచ్చుబడేలా చేసి మంచానికే పరిమితం చేసింది. అలాంటి స్థితిలో ఉన్న భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటూ కుట్టుమిషనే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్న ఆ ఇల్లాలికి విధి మరో సమస్యను తెచ్చిపెట్టింది. దీంతో దాతల సాయం కోసం ఆమె ఎదురుచూస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. అరసవల్లి ఆదిత్యనగర్ కాలనీలో పేద కుటుంబానికి చెందిన కళ్లేపల్లి రమేష్, సుజాత దంపతులు. రమేష్ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. ఆరేళ్ల క్రితం ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడటంతో రెండు కాళ్లకు ఆపరేషన్ చేశారు. సుమారు రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చు అయినప్పటికీ నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. ఇక ఇంటర్ చదువుతున్న కుమారుడు లీలా సాయికృష్ణకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ స్థాయి అధికమవ్వడంతో రక్తవాంతులతో బాధపడుతున్నాడు. ఈ కుర్రాడికి బ్రాన్కోసిస్ సమస్య ఉండటంతో బ్రాన్కోస్రోప్ పరీక్షలు చేయించాల్సి ఉంది. ఈ పరీక్షలకు విశాఖపట్నం ఆసుపత్రిలో సుమారు రూ.లక్ష వరకు అవుతుందని.. అంతటి ఆర్ధిక స్థోమత తమకు లేదని వాపోతున్నారు. భార్య కళ్లేపల్లి సుజాత ఎంతో కష్టపడి లేడీస్ టైలరింగ్ నేర్పిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంతటి దీన పరిస్థితిలో ఉన్న తమను దాతలెవరైనా ఆదుకుని (ఫోన్‌పే నంబర్ 9381442744) కాపాడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
అరసవల్లిలో దయనీయ స్థితిలో పేద కుటుంబం
మంచానికే పరిమితమైన తండ్రి
ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కుమారుడు
వైద్యఖర్చులకు సాయం కోసం ఎదురుచూపులు
రమేష్‌కు సదరం సర్టిఫికెట్ ద్వారా 66 శాతం అంగవైకల్యం ఉన్నట్లు వైద్యులు ధృవీకరించినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పింఛన్ మంజూరు చేయలేదు. రెండు కాళ్లకు ఆపరేషన్ జరిగి మంచానికే పరిమితమైనప్పటికీ సర్కార్ పెద్దలు దృష్టి సారించడం లేదు. నెలనెలా పింఛన్ వస్తేకుటుంబానికి కొంత భరోసా దక్కుతుందని, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పింఛన్ మంజూరు చేయాలని రమేష్ కోరుతున్నారు.