
శోక గీతిక
● అరుదైన వ్యాధితో అవస్థ పడుతున్న చిన్నారి ● ఆదుకోవాలని కుటుంబ సభ్యుల విన్నపం
కంచిలి:
మండలంలోని కుంబరినౌగాం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జగన్నాథ బెహరా చిన్న మనవరాలు మూడేళ్ల బేబీ గీతిక బెహరా అరుదైన వ్యాధితో బాధ పడుతోంది. అత్యంత అరుదైన ఈ వ్యాధి పుట్టినప్పుడే చిన్నారికి సంక్రమించింది. పాప ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తుండడంతో వైజాగ్ లో ఆస్పత్రుల్లో చూపించగా ఎస్‌ఎంఏ అనే వ్యాధి గా నిర్ధారించారు. ఇది పదివేల మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి నివా రణకు అతి ఖరీదైన ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కోట్లలో ఖర్చు కావడంతో దాతలు స్పందించాలని జగన్నాథ్ బెహరా కోరుతున్నారు. పాప ఆరోగ్య ప్రస్తుత పరిస్థితి తెలుసుకునేందుకు స్థానిక ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి మండల పార్టీ నేతలతో కలిసి శనివారం పరిశీలించారు. ఆరోగ్య వివరాలు తెలుసుకొని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆయనతోపాటు పార్టీ నేతలు దుర్గాసి ధర్మారావు, లడ్డుకేశవపాత్రో, కొణపల సురేష్, స్థానిక సర్పంచ్ హరిబంధు జన్ని, రంగాల శ్రీనివాస్‌లు ఉన్నారు.