మరో నలుగురికి తీవ్ర గాయాలు
మృతులంతా ఉత్తరాది రాష్ట్రాల వారే
హిరమండలం/మెళియాపుట్టి: పొట్టకూటి కోసం వందలాది కిలోమీటర్లు దాటి వలస వచ్చిన కార్మికులను పిడుగురూపంలో మృత్యువు బలగొంది. మెళియాపుట్టి మండలం గంగరాజపురం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ముగ్గురు క్వారీ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా టెక్కలి ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగరాజపురం సమీపంలో కొండపై రాజయోగి క్వారీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులు పనుల్లో ఉండగా మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు ప్రారంభమయ్యాయి.
ఒక్కసారిగా పిడుగుపడడంతో కార్మికులు కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో మేఘవాల్ హేమరాజ్(25), పింటు (25), శ్రావణ్‌కుమార్ (45) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. కాళ్ల జనార్దనరావు, జాన్ బొలియర్ సింగ్, కరణం బాలరాజు, బైపోతు హరిప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే మెళియాపుట్టి తహసీల్దార్ బడే పాపారావు, సీఐ ఎన్.సన్యాసినాయుడు, మెళియాపుట్టి ఇన్‌చార్జిగా ఉన్న పాతపట్నం ఎస్‌ఐ కె.మధుసూదనరావు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్టీవో ఎం.కృష్ణమూర్తి ఆస్పత్రికి వెళ్లి కార్మికులను పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
వలస కూలీలు..
గంగరాజపురం కొండపై కొద్దిరోజులుగా రాజయోగి పేరుతో క్వారీ నిర్వహిస్తున్నారు. దసరా పూజలు అనంతరం తిరిగి క్వారీ పనులు ప్రారంభించారు. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు మేఘావల్ హేమరాజ్(రాజస్థాన్), పింటూ(మధ్యప్రదేశ్), శ్రావణ్‌కుమార్(బీహార్) వలస కూలీలు. గాయాలపాలైన జనార్ధనరావుది టెక్కలిలోని ఆది ఆంధ్రావీధి, జాన్ బొలియర్ సింగ్‌ది ఒడిశాలోని టింఖియసాయి గ్రామం. కరణం బాలరాజుది మెళియాపుట్టి మండలం బందపల్లి కాగా, బైపోతు హరిప్రసాద్‌ది పెదలక్ష్మీపురం. వీరంతా డ్రిల్లింగ్, క్వారీ కటింగ్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది మేలో ఇదే మండలం దీనబంధుపురం క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఆ ఘటన మరువక ముందే పిడుగు రూపంలో బడుగులను మృత్యువు కబళించింది. తాజా ప్రమాదంతో క్వారీల్లో భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. నిబంధనలకు విరుద్ధంగా, సమయపాలన పాటించకుండా పనులు చేపడుతున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇన్‌చార్జి ఎస్‌ఐ మధుసూదనరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన పేలుడు వల్లే సంభవించి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం రిపో ర్టు వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం