
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవ కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో వివిధ శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడా వృథా నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. కాలువల శుభ్రపరిచే పనులను నిరంతరం కొనసాగించాలని సూచించారు. విద్యార్థులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 16 మండలాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సంతబొమ్మాళిలో 400 హెక్టార్లు, పాతపట్నంలో 250 హెక్టార్లు, కొత్తూరు, హిరమండలంలో 100 హెక్టార్ల చొప్పున నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. ధాన్యం మొలకెత్తడం, ధాన్యం పొట్టు దశలో నీరు చేరడం, పూత రాలిపోవడం వంటి నష్టం జరిగినట్లు తెలిపారు. దీనిపై తక్షణమే ప్రభుత్వానికి సమగ్ర నివేది క పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇంజినీరింగ్ పనుల్లో పూర్తయిన వాటికి బిల్లులు పెండింగ్‌లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఇంటింటికీ జీఎస్టీ ఫలాల ప్రచారంపై సమీక్షించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు బి.పద్మావతి, జయదేవి, ఇతర శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.