
సామాన్యుడి చేతికందించలేరా..?
● రేషన్‌లో
అందని కందిపప్పు
● బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ
● ఉద్దానంలో కిడ్నీ రోగులకు అందని గోధుమలు, రాగులు
వజ్రపుకొత్తూరు:
రేషన్ సరుకుల జాబితా నుంచి కందిపప్పు కనుమరుగైపోయింది. ఇదివరకు రేషన్‌లో బియ్యం, చక్కెరతో పాటు కందిపప్పును కూడా చౌకధరకే అందించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కందిపప్పును పంపిణీ చేయడం ఆపేసింది. లబ్ధిదారులు అడిగిన ప్రతిసారి వచ్చే నెల వస్తుందని డీలర్లు చెప్పడం తప్ప ఇచ్చిన దాఖలా లేదు. పైగా అక్కడక్కడా రేషన్ షాపుల్లోనే ఏర్పాటు చేసిన దుకాణాల్లో కందిపప్పును విక్రయిస్తున్నారు. అదే కందిపప్పును రేషన్‌లో భాగంగా ఇస్తే ఇంకా తక్కువ రేటుకే అందించవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం విక్రయానికే మొగ్గు చూపుతోంది.
పౌష్టికాహారం ఎలా..?
జిల్లాలో 6,60,730 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రేషన్ ద్వారా అందే సరుకులతోనే పేదవాడి కుటుంబం పౌష్టికాహారం పొందగలదు. ఆ ఉద్దేశంతోనే ఇదివరకు రేషన్‌లో కందిపప్పుతో పాటు గోధుమలు, రాగులు, వంట నూనె వంటివి కూడా కొన్నాళ్లు అందించారు. కూటమి వచ్చాక రేషన్ బియ్యం, చక్కెరకు మాత్రమే పరిమితమైంది. దీంతో సామాన్యులు అధిక ధరలకు మిగిలిన వాటిని కొనక తప్పడం లేదు. మరీ ముఖ్యంగా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రేషన్‌లో గోధుమ లు, రాగుల పిండి, వంటనూనె ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉన్నవి తీసేస్తోంది. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, అధికారులు పేద, మధ్య తరగతులకు చెందిన కిడ్నీ బాధిత ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్దానం వాసులు కోరుతున్నారు.
కిడ్నీ వ్యాధి గ్రస్తులను దృష్టిలో ఉంచాలి
ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులను దృష్టిలో ఉంచుకుని గోధుమలు, కందిపప్పు, వంట నూనెలను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలి. మా గ్రామంలో ఎక్కువ మంది కిడ్నీ రోగులు ఉన్నారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో అత్యధిక మంది కిడ్నీ రోగులు ఉన్నందున తగిన నిర్ణయం తీసుకోవాలి. గత ప్రభుత్వం ప్రతి నెల కంది పప్పు అందించేది. కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
– దున్న నాగేశ్వరరావు, యూఆర్‌కేపురం
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ చేయడం లేదు. కిడ్నీ రోగులకు గోధుమలు, రాగులు, వంట నూనెలు అవసరమే. వారి డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళతాం.
– కె.రామారావు, సీఎస్‌డీటీ, వజ్రపుకొత్తూరు

సామాన్యుడి చేతికందించలేరా..?

సామాన్యుడి చేతికందించలేరా..?

సామాన్యుడి చేతికందించలేరా..?