
●ముంపు ప్రాంతాల పరిశీలన
ఇచ్ఛాపురం రూరల్: వరద ముంపు ప్రాంతాలను జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ శనివారం పరిశీలించారు. శనివారం ఆమె మండలం తులసిగాం, ఇన్నేశుపేట గ్రామాల్లో పర్యటించి ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు బాహుదా నదిలో వరద నీరు చేరడంతో పద్మపురం గెడ్డ ఉప్పొంగి సుమారు 300 ఎకరాలకు పైగా పంట పొలాలు వరద నీటి ముంపునకు గురయ్యాయని అన్నారు. ప్రభుత్వం ఎరువుల పంపిణీలో విఫలం కావడంతో రైతులు ఒడిశాలో అధిక మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేశారని, ఇప్పుడు మళ్లీ ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు క్షేత్రస్థాయి లో ముంపు ప్రాంతంలో పర్యటించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎరువులు అందజేయాలని కోరారు. ఎంపీపీ బోర పుష్ప, వైస్ ఎంపీపీ దువ్వు వివేకానందరెడ్డి, మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, సర్పంచ్ ఇసురు తులసీరామ్, ఇసురు యాదవరెడ్డి, వలసయ్య, ఇసురు పరుశురాం తదితరులు ఉన్నారు.