
దసరా ప్రత్యేక బస్సులు
దూరప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు
సాధారణ చార్జీలతోనే గమ్యస్థానాలకు
రాను, పోను టికెట్‌లు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు
శ్రీకాకుళం అర్బన్: దసరా సందర్భంగా ఏపీఎస్‌ఆర్ ఆర్టీసీ సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడపనుంది. జిల్లాలోని శ్రీకాకుళం–1, శ్రీకాకుళం–2, టెక్కలి, పలాస తదితర నాలుగు డిపోల నుంచి 480 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబరు 6వ తేదీ వరకూ ఈ సర్వీసులు నడపనున్నారు. అందుకు తగ్గట్లుగా ఆర్టీసీ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.
దసరా పండగ సందర్భంగా ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ స్కూళ్లకు, ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకూ కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో అందుకు తగ్గట్లుగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. పండగ ముందు బస్సులు, పండగ తర్వాత తిరుగు ప్రయాణ రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దూరప్రాంత ప్రయాణికులు తమ టికెట్లను ఆన్‌లైన్‌లో ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక బస్సులు ఇలా..
దసరా పండగ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి దూరప్రాంతమైన విజయవాడకు 7 బస్సులు నడుస్తున్నాయి. అలాగే టెక్కలి నుంచి రాజమండ్రికి 5 బస్సులు, కాకినాడ నుంచి పాతపట్నంకు 2 బస్సులు, టెక్కలి నుంచి అమలాపురానికి 3 బస్సులు నడుస్తున్నాయి. అలాగే శ్రీకాకుళం నుంచి విశాఖకు 25 అల్ట్రా డీలక్స్, 11 అల్ట్రా పల్లెవెలుగులు, 8 పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి విశాఖపట్టణంకు ప్రతి 5 నిమిషాలకు ఒక నాన్‌స్టాప్ బస్సు అందుబాటులో ఉండగా ప్రత్యేక బస్సులతో కలిపి ప్రతి 2 నిమిషాలకు ఒక నాన్‌స్టాప్ బస్సు నడవనుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇంకా అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
10 శాతం రాయితీ
ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు ఎప్పటిలాగే బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే ప్రయాణ చార్జీలో 10శాతం రాయితీ ఇస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించేవారు రాను, పోను టికెట్ తీసుకుంటే 10శాతం రాయితీ ఇస్తున్నారు.
రద్దీకి తగ్గట్టుగా సర్వీసులు
దసరా పండగను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగానే ఆర్టీసీ బస్సులు నడుపుతాం. దూర ప్రాంతాల నుంచి శ్రీకాకుళంకు, తిరుగు ప్రయాణ సమయంలో శ్రీకాకుళం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో ఎలాంటిటి అదనపు చార్జీలు ఉండవు. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
– సీహెచ్ అప్పలనారాయణ, డీపీటీఓ