
నిర్లక్ష్యపు నీడలో..!
కొత్తూరు: జిల్లాలో వందలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న చెరువుల బాగోగులను అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు వాటి రూపం కోల్పోతున్నాయి. వర్షాలు పడితే తప్పా జిల్లాలోని చెరువుల కింద సాగు చేస్తున్న పొలాల్లో వరినాట్లు వేయలేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని 30 మండలాల్లో 6,630 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు(సాగునీటి చెరువులు) ఉన్నాయి. అందులో వంద ఎకరాల ఆయకట్టుకు దాటి సాగునీరు అందిస్తున్న చెరువులు 655 ఉన్నాయి. వీటి ద్వారా జిల్లాలో ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 2.65 లక్షల ఎకరాల్లో వరి పంటకు సాగునీరు అందిస్తున్నాయి. అయితే సాగునీటి చెరువుల మరమ్మతులు, పూడికలు తీయడానికి, చెరువులు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు అవసరమైన నిధులు కేటాయించకపోవడంతో పూడికలు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. అలాగే మరోవైపు ఆక్రమణలకు గురవ్వడంతో వాటి రూపం కోల్పోయాయి. దీంతో చెరువుల్లో నీటి సామర్థ్యం తగ్గి ఆయకట్టు భూములకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలోని 6,630 చెరువుల్లో 9.85 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేది. అయితే చెరువులు నిర్లక్ష్యానికి గురవ్వడంతో పాటు ఆక్రమణలకు గురికావడం, పూడికలతో నిండిపోవడంతో ప్రస్తుతం నీటి సామర్థ్యం 7.52 టీఎంసీలకు తగ్గింది. దీంతో శివారు భూములకు సాగునీరు అందక.. రైతులు వర్షపు నీటిపైనే ఆధారపడుతున్నారు. వర్షాలు కురవకపోతే కొన్ని సందర్భాల్లో వరినాట్లు వేయని సందర్భాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా పంటలు పొట్టదశలో, వెన్ను దశలో ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
రూ.200 కోట్లతో ప్రతిపాదనలు
జిల్లాలోని 663 ఎంఐ ట్యాంకుల అభివృద్ధి కోసం ఆర్‌ఆర్‌ఆర్ కమిటీ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణలో రూ.200 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నాము. నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి పంపిస్తాము. నిధులు మంజూరైన వెంటనే చెరువుల్లో పనులు జరగడం జరుగుతుంది.
– పొన్నాడ సుధాకరరావు, మైనర్ ఇరిగేషన్
ఇన్‌చార్జి ఎస్‌ఈ, శ్రీకాకుళం జిల్లా
నిర్లక్ష్యానికి గురయ్యాయి
సాగునీటి చెరువులు నిర్లక్ష్యానికి గురికావడంతో ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదు. బలద గ్రామానికి చెందిన సుమారు 89 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పద్మనాభ సాగరం సుమారు 525 ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది. అటువంటి ఈ చెరువు పూడికలు, పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో పాటు ఆక్రమణకు గురయ్యింది. అధికారులు స్పందించి చెరువులో పూడికలు తీయడానికి నిధులు కేటాయించాలి. – బీవీ రమణమూర్తి,
బలద గ్రామం, కొత్తూరు మండలం
ఉపాధి పథకం ద్వారా చెరువు పనులు చేస్తున్నప్పటికీ ఆక్రమణలు తొలగించకుండా పనులు చేస్తుడడంతో ఉపయోగం ఉండడం లేదు. అందువలన ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిర్లక్ష్యానికి గురైన మైనర్ ఇరిగేషన్ చెరువులకు నిధులు కేటాయించి, ఆక్రమణలు తొలగించి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
మరమ్మతులకు నోచుకోని సాగునీటి చెరువులు
వెంటాడుతున్న నిధుల కొరత
యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్న వైనం
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఆక్రమణలు తొలగించాలి
తరాలు నుంచి వస్తున్న సాగునీటి చెరువులు పలు గ్రామాల్లో ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో ఆయకట్టు భూములకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. దీంతో వరిపంట సాగుకు వర్షాలపై ఆధారపడుతున్నాము. ఆక్రమణలు తొలగించి చెరువులకు పూర్వ వైభవం తీసుకు రావాలి.
– గార రాజులునాయుడు, మాకవరం,
కొత్తూరు మండలం

నిర్లక్ష్యపు నీడలో..!

నిర్లక్ష్యపు నీడలో..!

నిర్లక్ష్యపు నీడలో..!