
దొంగలను పట్టించిన రోడ్డు ప్రమాదం
● పోలీసుల అదుపులో నిందితులు
పలాస/శ్రీకాకుళం క్రైమ్: పలాస మండలంలోని మోదుగులపుట్టి గ్రామానికి చెందిన అవుగాన పార్వతీశం, అవుగాన రమణలకు చెందిన సుమారు రూ.1.5 లక్షల విలువైన పెద్ద మేకపోతులను సోమవారం రాత్రి దొంగతనం చేశారు. మోదుగులపుట్టి సమీపంలోని కొత్తపేటలో మేకల మందను వేయగా.. రాత్రిపూట మంద వద్దకు వెళ్లిన నలుగురు వ్యక్తులు దొంగతనం చేసి ఎత్తుకుపోయారు. మోదుగులపుట్టి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కోసంగిపురం జగనన్న కాలనీ సమీపంలో ఉన్న సోంపేట మండలం గొల్లూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, పలాస మండలం అనంతగిరి గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో పాటు మరో ఇద్దరు దొంగతనం చేశారు.
ప్రమాదం జరగడంతో...
మేకలను దొంగిలించిన నలుగురు యువకులు కారులో శ్రీకాకుళం నగరానికి తీసుకెళ్లి అమ్మేశారు. తిరుగు ప్రయాణంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పోలీసులకు పట్టుబడడంతో విచారణలో అసలు విషయం బయటకొచ్చింది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పలాస మండలంలో మేకలు దొంగతనం చేసిన కె.సాయికుమార్, కె.గణేష్, ఎం.వంశీ, ఎల్.ఛత్రపతిలు ఐదు మేకలను దొంగిలించి, కారులో ఎక్కించి నగరంలోని గుజరాతీపేటలో మటన్ షాపు నిర్వాహకుడికి తక్కువ ధరకు అమ్మేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో హయాతీనగరం వచ్చేసరికి కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. అప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి విషయం పూర్తిగా తెలిసినా డ్రంక్ అండ్ డ్రైవ్‌తో సరిపెట్టేద్దామనుకున్నారు. సమాచారం ప్రత్యేక విభాగ పోలీసులకు అందడంతో చేసేదేమీలేక ట్రాఫిక్ పోలీసులు ఒకటో పట్టణ పోలీసులకు యువకులను అప్పగించారు. దీంతో ఎస్‌ఐ ఎం.హరికృష్ణ యువకులను ప్రశ్నించగా అసలు విషయాలు బయటకొచ్చాయి. ఎప్పటినుంచో నగరంలోని ఏడురోడ్ల కూడలి సమీపంలో మంచి పేరున్న మటన్ షాపు నిర్వాహకుడి కుమారుల్లో ఒకరైన రాజు (గుజరాతీపేట షాపునకు) వద్దకు వెళ్లి తక్కువ ధరకు అమ్మారని తెలిసింది. గతంలో కూడా రూరల్ మండలం పాత్రునివలసలో రెండో పట్టణ పరిధి ఇద్దరు రౌడీషీటర్లు గొర్రెలు ఇదే నిర్వాహకుడికి అమ్మడంతో అప్పట్లో కూడా పోలీసులు ఇతడిని విచారించడం గమనార్హం. విచారణ అనంతరం కేసును కాశీబుగ్గ స్టేషన్‌కు బదలాయించినట్లు ఎస్‌ఐ ఎం.హరికృష్ణ వెల్లడించారు.