
ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవం
ఎచ్చెర్ల: బీఆర్‌ఏయూలో ఎన్‌ఎస్‌ఎస్ 57వ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డా.ఎం.సుధాకర్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సేవాభావం, సామాజిక బాధ్యత, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అందించేది ఎన్‌ఎస్‌ఎస్ మాత్రమేనన్నారు. ప్రతీ విద్యార్థి ఎన్‌ఎస్‌ఎస్‌లో భాగస్వామ్యం కావడం ద్వారా దేశ ప్రగతికి ఊతమిచ్చినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య, పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాత, నెహ్రూ యువకేంద్రం ఉప సంచాలకుడు కె.వెంకట ఉజ్వాల్, బెజ్జపురం యూత్‌క్లబ్ డైరెక్టర్ ఎం.ప్రసాదరావు, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ డా.డి.వనజ తదితరులు మాట్లాడుతూ.. 1969లో గాంధీజీ శత జయంతోత్సవాల సందర్భంగా దేశంలోని 37 వర్సిటీల్లో ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఎస్ సేవలు.. నేడు అన్ని వర్సిటీలు, కాలేజీల్లో విస్తృతమయ్యాయన్నారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక చైతన్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రగతిదాయక కార్యక్రమాలకు వాలంటీర్లు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్స్ డా.ఎం.అనూరాధ, డా.సీహెచ్.రాజశేఖరరావు తదితరులు కూడా మాట్లాడారు. జిల్లాస్థాయిలో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఈ కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అదేవిధంగా జిల్లా, వర్సిటీ స్థాయిలో ఎంపిక చేసిన పదిమంది ఎన్‌ఎస్‌ఎస్ పీవోలకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. అలాగే వర్సిటీలో ఏడు యూనిట్ల పీవోలకు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. అంతకుముందు నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.