
ప్రయాణానికి ప్రయాసలు..!
● డీఎస్సీ అభ్యర్థులతో తరలి వెళ్లిన బస్సులు
● జిల్లాలో ప్రయాణాలకు ఇబ్బందులు
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ బుధవారం ప్రయాణికులతో రద్దీగా మారింది. జిల్లాలోని కోటబొమ్మాళిలో కొత్తమ్మ తల్లి పండగలు జరుగుతుండడం, దసరా పండగ సందర్భంగా దూరప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చే ప్రయాణికులతో కిటకిటలాడింది. అయితే ప్రయాణికులకు తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. బస్సుల కోసం ప్రయాణికులు ఫుట్‌పాత్‌లపై వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తరలివెళ్లిన 37 ఆర్టీసీ బస్సులు
ఇటీవల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీలో సెలెక్టయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం విజయవాడ రమ్మని పిలిచింది. వీరంతా ఈనెల 25వ తేదీకి హాజరవ్వాలని చెబుతూ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను వేసింది. దీంతో జిల్లా నుంచి శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలో 11 బస్సులు, శ్రీకాకుళం రెండో డిపో పరిధిలో 7 బస్సులు, టెక్కలి డిపో నుంచి 8 బస్సులు, పలాస డిపో నుంచి 8 బస్సులు, పాలకొండ డిపో నుంచి 3 బస్సులను విజయవాడకు వేశారు. దీంతో బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సకాలంలో రాని బస్సులు
విజయవాడకు 37 బస్సులు తరలిపోవడంతో సకాలంలో ఆర్టీసీ బస్సులు రాలేదు. దీంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. బస్సు ఎప్పుడు వస్తుందోనని ఫుట్‌పాత్‌లపై ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చే బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. దూరప్రాంతాలకు వెళ్లేందుకు నాన్‌స్టాప్ కౌంటర్ వద్ద బారులుతీరుతూ కనిపించారు. నాన్‌స్టాప్ కౌంటర్ వద్ద రద్దీ అధికంగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు పల్లె వెలుగు బస్సులనే నాన్‌స్టాప్ బస్సులుగా నడిపారు.
శ్రీకాకుళం: జిల్లా నుంచి డీఎస్సీ 2025కు ఎంపికై న అభ్యర్థులను విజయవాడ తరలించారు. 673 మంది అభ్యర్థులు జిల్లా నుంచి ఎంపిక కాగా, వీరితోపాటు వీరికి సహాయకులుగా 673 మందిని 37 బస్సుల్లో తీసుకువెళ్లారు. స్థానిక ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ఆవరణ నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు ఈ బస్సులు బయల్దేరాయి. బస్సులను ఆర్డీఓ సాయి ప్రత్యూష జండా ఊపి ప్రారంభించారు. ప్రతి బస్సులోనూ ఓ కానిస్టేబుల్‌తో పాటు ముగ్గురు సహాయకులను పంపించారు. అభ్యర్థులతో పాటు డీఈఓ రవిబాబు, ఉప విద్యాశాఖ అధికారి విజయ కుమారి తదితరులు వెళ్లారు. వీరందరికీ గురువారం విజయవాడలో జరిగే ఓ కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేస్తారు. అటు తర్వాత వీరందరికీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పాఠశాలలను కేటాయిస్తారు.