
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
శ్రీకాకుళం పాతబస్టాండ్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో బుధవారం మత పెద్దలు, కుల పెద్దలతో బాల్య వివాహాలు – అనర్థాలు – చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన కొన్ని సామాజికవర్గాల్లో ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన ఆడ పిల్లలకు అనే అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచిస్తూ, బాల్య వివాహాల నివారణ కోసం ప్రభుత్వ పథకాలను వివరించారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే 15100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం లేదా స్థానిక జిల్లా కోర్టు భవనంలోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ మత పెద్దలు, కె.రమణ (ఐసీపీఎస్), జి.ఇందిరాప్రసాద్ (అడ్వకేట్), కె.ఆఫీసు నాయుడు (చీఫ్ ఎల్‌ఏడీసీ) తదితరులు పాల్గొన్నారు.
‘మాన్యువల్ పద్ధతిలో ప్లేసులు కేటాయించాలి’
శ్రీకాకుళం: డీఎస్సీ–2025 అభ్యర్థులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా ప్లేసులు కేటాయించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వీ రమణ మూర్తి, జి.రమణ ప్రభుత్వానికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. చాలామంది ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌పై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఎలాంటి ముందుస్తు సమాచారం ఇవ్వకుండా క్లస్టరు వేకెన్సీల గురించి పూర్తి సమాచారం ఇవ్వకుండా అప్పటి అధికారులు వెబ్ కౌన్సిలింగ్ పేరిట దూరం ప్లేసులు కేటాయించారని ఇప్పటికీ ఆవేదన చెందుతూనే ఉన్నారని, కాబట్టి డీఎస్సీ 2025 అభ్యర్థులందరికీ మాన్యువల్ పద్ధతిలోనే ప్లేసులు కేటాయించాలని తెలియజేశారు.
నాటుసారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న నాటుసారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, కొత్తూరు మండలాలకు ఆనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగిపూర్, నేరేడి గూడ, శిరడా, గురిసింగిగూడ, దిదింగూడ పరిసరాల్లో 720 లీటర్ల నాటుసారా, 6,800 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే భారీగా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. సారా తయారీ, విక్రయాలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. దాడుల్లో శ్రీకాకుళం అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు, సూపరిటెండెంట్లు మురళీ, కుమార్, ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, జిల్లా టాస్క్‌ఫోర్స్ పాతపట్నం, టెక్కలి, పలాస, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, కాశీనగర్ ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.