
ఉద్యోగులను మోసగిస్తున్న ప్రభుత్వం
శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలకు ఒక్క పైసా కూడా ప్రయోజనం కల్పించలేదని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రమణ మండిపడ్డారు. ఆదివారం నగరంలోని దాసరి క్రాంతిభవన్‌లో కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు దనపు ఇంక్రిమెంట్లు, బోనస్‌లు అడగడం లేదని, తమకు న్యాయంగా రావలసిన ఆర్థిక ప్రయోజనాలనే సకాలంలో చెల్లించాలని కోరుతున్నారని గుర్తు చేశారు.వాటిని కూడా చెల్లించకపోవడం మోసం చేయడం కాదా?అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో అధిక మొత్తంలో పెట్టుబడులను మనమే ఆకర్షిస్తున్నామని దేశంలోకెల్లా అత్యధిక వృద్ధిరేటు నమోదులో మనమే ఉన్నామని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి మరి ఉద్యోగులకు న్యాయంగా రావలసిన ప్రయోజనాలకు ఎందుకు గండి కొడుతున్నారో చెప్పాలన్నారు. సంక్రాంతి, దీపావళి, రెండు దసరాలు వెళ్లిపోయినా ఉద్యోగులకు మాత్రం పండగ ఆనందం లేదని, రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, కనీసం దసరా కానుకగానైనా ఒక డీఏ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు సమర్థంగా నిర్వహించాలని కోరారు. అనంతరం సమస్యల పరిష్కారం కోరుతూ అక్టోబర్ 7న ఫ్యాప్టో తలపెట్టిన విజయవాడ ధర్నా కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రామకృష్ణ, చింతల రామారావు, బి.ఇందిర, డీవీఎన్ పట్నాయక్, సంగమేశ్వరరావు, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.