
అరణ్య రోదన..!
నిర్వాసితుల మిగులు భూములు
న్యాయం జరుగుతుంది
వంశధార నిర్వాసితుల మిగుల భూముల సమస్య ఎప్పటినుంచో ఉంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. తప్పకుండా ఉన్నతాధికారులు పరిష్కారం చూపుతారు. నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది.
– ఎ.జోగారావు, తహసీల్దారు, హిరమండలం
మా గోడు పట్టదా..?
వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ కోసం సర్వం త్యాగం చేశాం. కానీ మా త్యాగాలకు విలువ లేకుండా పోయింది. మిగులు భూముల సమస్యలు పరిష్కరించాలని గత 15 సంవత్సరాలుగా కోరుతూనే ఉన్నాం. కానీ మా గోడు వినిపించుకునే వారు కరువయ్యారు.
– గొర్లె చంద్రినాయుడు, నిర్వాసితుడు, దుగ్గుపురం నిర్వాసిత గ్రామం
హిరమండలం:
వంశధార రిజర్వాయర్ కోసం సర్వం త్యాగం చేశారు వారు. కానీ రెండు దశాబ్ధాలు దాటుతున్నా వారి త్యాగాలకు మాత్రం సరైన న్యాయం జరగడం లేదు. వారికి స్వాంతననిచ్చే నిర్ణయం రావడం లేదు. వంశధార రిజర్వాయర్‌కు సంబంధించి మిగులు భూముల విషయంలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాయితీ రావడం లేదు. వాటికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించలేదు. చివరకు పంటలు పండించేందుకు ఎరువులు కూడా అందించడం లేదు. దీంతో వందలాది మంది రైతుల బాధలు వర్ణనాతీతం. 2005లో వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2007 నుంచి హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల పరిధిలోని 10 వేల ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. 2010లో సేకరణ పూర్తయ్యింది. నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం కూడా అందించింది. అయితే రిజర్వాయర్ నిర్మాణానికి ఇచ్చిన భూమి పోనూ.. మిగులు భూమి విషయంలో తలెత్తిన రెవెన్యూ సమస్యలను అధికారులు ఇంతవరకూ పరిష్కరించలేదు. అయితే చేతిలో భూమి ఉందన్న విషయమే తప్ప.. ఆ భూములకు సంబంధించి బ్యాంకు రుణాలు రావడం లేదు. విత్తనాలు ఇవ్వడం లేదు. అన్నదాత సుఖీభవ లాంటి సాగు ప్రోత్సాహం లేదు. ఎందుకంటే మిగులు భూమికి సంబంధించి ధ్రువపత్రాలు, రిజర్వాయర్ నిర్మాణానికి నిర్వాసితులు వదులకున్న భూములతో లింకు కావడమే. రిజర్వాయర్ కోసం రైతుల నుంచి సేకరించిన భూములు, మిగులు భూములను విడగొట్టకుండా అప్పట్లో అధికారులు సాంకేతిక తప్పిదానికి పాల్పడ్డారు. ఆ శాపం ఇప్పుడు రైతులకు వెంటాడుతోంది.
13 గ్రామాలదే సింహభాగం
హిరమండలం మండలం పాడలి, దుగ్గుపురం, తులగాం, పెద్దసంకలి, గార్లపాడు, చిన్నకొల్లివలస తదితర 13 గ్రామాల రైతులు వేలాది ఎకరాలను వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి వదులుకున్నారు. రిజర్వాయర్‌లో సింహభాగం భూమి ఈ గ్రామాల వారిదే. ఆ సమయంలో రిజర్వాయర్ ఎగువున ఉన్న భూములను మిగులు భూములుగా గుర్తించారు. వాటిని రైతులకు విడిచిపెట్టారు. అయితే ఇక్కడ ఒక చిక్కొచ్చిపడింది. ఒకే సర్వే నంబర్, వెబ్‌ల్యాండ్‌లో ఉన్న భూమి రిజర్వాయర్‌కు ఇచ్చిన దాంట్లోనూ.. మిగులు భూమిగానూ ఉంది. అప్పట్లో రెవెన్యూ రికార్డులు విభజించకుండా పూర్తి చేశారు. దీంతో అదంతా రిజర్వాయర్ భూమి పరిధిలో ఉండడంతో దాదాపు 2,200 ఎకరాల మిగు లు భూములకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ పథకమూ వర్తించడం లేదు. ఇలా పథకాలు దక్కని మిగులు భూములకు సంబంధించి పాడలిలో 264 ఎకరాలు, దుగ్గుపురంలో 180, అంతిలిలో 1,200, పెద్దసంకిలిలో 220, గార్లపాడులో 150, చిన్నకొల్లివలసలో 100 ఎకరాలు ఉన్నాయి. అయితే ఈ రైతులంతా తహసీల్దారు, జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో వినతిపత్రాలు అందించుకోవడమే తప్ప సమస్యకు మాత్రం పరిష్కార మార్గం దొరడకం లేదు. అందువలన ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
వంశధార నిర్వాసితులకు తీరని అన్యాయం
20 ఏళ్ల క్రితం రిజర్వాయర్‌కు సర్వం త్యాగం
మిగిలిన 2,200 ఎకరాల భూములకు
వెంటాడుతున్న సమస్యలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయానికి దూరం
చాలా అన్యాయం
ఇంతకంటే అన్యాయం ఉంటుందా..?. రిజర్వాయర్‌కు భూములిచ్చాం. కొన్ని భూములు మిగిలాయి. వాటిపై ప్రత్యేకంగా హక్కు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కానీ అది తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తోంది. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలి.
– పెద్దకోట సాదుబాబు, నిర్వాసితుడు, పాడలి నిర్వాసిత గ్రామం

అరణ్య రోదన..!

అరణ్య రోదన..!

అరణ్య రోదన..!

అరణ్య రోదన..!