
టీడీపీ నాయకుల బరితెగింపు
● కొత్త కుంకాంలో చెరువు ఆక్రమణ
● రెవెన్యూ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
● హెచ్చరికలు బేఖాతరు చేస్తున్న వైనం
రణస్థలం: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. ఇటీవల టీడీపీ నాయకులు గ్రావెల్ దందా చేసి సొమ్ము చేసుకుంటే.. నేడు ఆ పార్టీ కార్యకర్తలు ఏకంగా చెరువులనే కబ్జా చేస్తున్నారు. లావేరు మండలంలోని కొత్తకుంకాం గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. కొత్త కుంకాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 55లో పెద్ద కోనేరు చెరువు ఉంది. ఈ చెరువు మడ్డువలస కాలువ వలన రెండు పాయలుగా చీలిపోయింది. ఒకవైపు సుమారు రెండు ఎకరాల పరిధిలో ఉన్న చెరువును స్థానిక టీడీపీ నాయకులు ఆక్రమించే చర్యలు చేపట్టి ఇప్పటికే ఎకరా వరకు కప్పివేశారు. ఉన్న మరో ఎకరాను పూర్తిగా అక్రమించే చర్యలు గత పదిహేను రోజులుగా చేపట్టారు. దీనిపై గ్రామంలో ఎంత వ్యతిరేకత వచ్చినా కనీసం స్పందించకుండా టీడీపీ కార్యకర్తలు వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు. కొందరికి మాత్రం ఊరులో ఉన్న కోవెల ఆదాయం కోసం మొక్కలు వేసి సాగు చేస్తామని చెబుతున్నారు.
కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఈనెల 8వ తేదీన కలెక్టర్ గ్రీవెన్స్‌లో స్థానిక గ్రామస్తుల తరుపున ఒక వ్యక్తి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా ఉంది. చెరువును కూనపల్లి కిషోర్ కుమార్, బత్తుల గిరిబాబులు అక్రమిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ మేరకు రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా పరిశీలించి వెళ్లిపోయారు. మండల రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే అధికారుల అదేశాలు బేఖాతర్ చేస్తూ మరలా సోమవారం నుంచి టీడీపీ నాయకులు ఆక్రమించే చర్యలు చేపట్టారు. దీనిపై గ్రామస్తులంతా కలిసి అధికారులకు సమాచారం అందించినా ఫలితం లేకుండా పోయింది. ఫిర్యాదు అందిందని ప్రస్తుతం పనులు ఆపించాం. వర్షం పడుతుంది పోలీసుల బందోబస్తుతో వెళ్తామని రెవెన్యూ అధికారుల ఒక వైపు చెబుతుంటే... ఏ రెవెన్యూ అధికారి వచ్చినా ఆపేది లేదని టీడీపీ అక్రమణదారులు సవాల్ విసురుతున్నారు.
ఆక్రమణలు తొలగిస్తాం
చెరువు ఆక్రమణకు సంబంధించి గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు సిబ్బంది వెళ్లి పరిశీలించారు. సరిహద్దులు నిర్ధారించి ఆక్రమణలు నిజమని తేలితే తొలగిస్తాం. ఉపాధి హామీ పనులు చేపట్టి చెరువును అభివృద్ధి చేస్తాం.
– జీఎల్‌ఈ శ్రీనివాసరావు, తహసీల్దార్, లావేరు

టీడీపీ నాయకుల బరితెగింపు