
నరకయాతన..!
● వైద్యుని రాకకోసం దివ్యాంగుల ఎదురుచూపులు
● పలాస ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సదరం ఇక్కట్లు
పలాస: స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి వద్ద దివ్యాంగులకు సదరం ఇక్కట్లు అంతా ఇంతా కాదు. సంబంధిత వైద్యుడు సమయానికి రాకపోవడంతో గంటల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి సోమవారం నెలకొంది. అక్కడ సరైన సదుపాయాలు కూడా లేకపోవడంతో నరకయాతన అనుభవించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. పలాస సామాజిక ఆస్పత్రి వద్ద ప్రతీవారం సదరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల కోసం ఇచ్ఛాపురం మొదలుకొని పలాస వరకు పలాస రెవిన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చే వారికి వారానికి 30 మందికి చొప్పున పరీక్షలు చేయాల్సి ఉంది. గత వారం సదరం పరీక్షలు జరగలేదు. దీంతో సోమవా రం మొత్తం 60 మంది వివిధ రకాల దివ్యాంగులు ఉదయం 7 గంటలకే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎముకలు, కీళ్లు వ్యాధులకు సంబంధించిన వైద్యుడు డాక్టరు చిన్నంనాయుడు ఉదయం 9 గంటలకు రావాల్సి ఉంది. అయితే ఆయన ఆస్పత్రికి వచ్చి వెంటనే బయటకు వెళ్లిపోయారు. డాక్టర్‌ను అక్కడికి వచ్చినవారు చూశారు. ఇక పరీక్షలు చేస్తారని సంతోషపడ్డారు. అయితే అంతలోనే అక్కడ నుంచి అతను మాయమైపోయారు. దీంతో అతని కోసం సుమారు 2 గంటల పాటు ఎదురుచూశారు. అక్కడ వైద్య సిబ్బందికి అడిగితే.. వస్తారని చెబుతున్నారు గానీ రాకపోవడంతో వికలాంగులు నరకయాతన అనుభవించారు. కనీసం అక్కడ ఫ్యాన్లు, కుర్చీలు లేవు. మలమూత్ర విసర్జాలకు కూడా బయటకు వెళ్లలేరు. ఈవిధంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నింపాదిగా సుమారు 12 గంటల సమయంలో వైద్యుడు చిన్నంనాయుడు వచ్చి పరీక్షలు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి సుమారు 60 మంది వికలాంగులు ఈ సదరం పరీక్షలకు వచ్చారు. ఈ విషయంపై వైద్యుడు చిన్నంనాయుడుని వివరణ కోరగా తాను ఒక గంట ఆలస్యంగా రావడం వాస్తవమేనని, అయితే వచ్చిన 50 మందికి పరీక్షలు ఒంటిగంటలోపే చేశామని తెలియజేశారు.
చాలా ఇబ్బంది పడ్డాం
వైద్యుడు సమయానికి రాకపోవడం చాలా ఇబ్బంది పడ్డాం. మా ఇంట్లో మా బావ కొడుకు చనిపోయాడు. అక్కడకి వెళ్లలేని.. ఇక్కడ ఉండలేని పరిస్థితి. మా బాబు కదల్లేడు. కవిటి నుంచి వచ్చాము. మా ఇబ్బందులు ఆ దేవుడుకు తెలుసు. – బృందావతి, సహాయకురాలు, సిగలపుట్టుగ, కవిటి మండలం
కనీస సదుపాయాలు లేవు
డాక్టర్ కోసం ఉదయం 7 గంటలకు వచ్చాను. ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసుకొని ఉన్నాను. కనీసం మూత్రం పోయడానికి కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి. అక్కడ ఉండడానికి కనీసం కుర్చీలు కూడా లేవు. నరకయాతన అనుభవించాము.
– యజ్జల వెంకటరావు, బారువ, సోంపేట మండలం

నరకయాతన..!

నరకయాతన..!