శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలు సోమవారం మూతపడ్డాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంతోపాటు నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు కాలేజీల్లో తరగతులను రద్దుచేసి కాలేజీలను మూసివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖామంత్రిని పలుమార్లు కలిసినప్పటికీ న్యాయం జరగకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో కాలేజీల్లో క్లాసులను రద్దు చేయాలని నిర్ణయించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పందించినవరకు కాలేజీల్లో క్లాసులను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ఏపీ ప్రైవేటు డిగ్రీ కాలేజీల మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.జయరాం పేర్కొన్నారు. ప్రభుత్వం, విద్యాశాఖామంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.