నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గం ఎన్నిక

Sep 23 2025 11:13 AM | Updated on Sep 23 2025 11:13 AM

నూతన

నూతన కార్యవర్గం ఎన్నిక

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ ట్రెజరీ ఉద్యోగుల సంఘం (ఏపీటీఎస్‌ఏ) జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. దీనిలో భాగంగా జిల్లా అధ్యక్షుడిగా డి.శ్రీరామ్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శిగా ఎం.డేవిడ్‌, జిల్లా కోశాధికారిగా కె.వరప్రసాద్‌. ఉపాధ్యక్షులుగా ఎం.సాయిప్రసాద్‌, విజయ భాస్కర్‌ రాథో, అసోసియేట్‌ అధ్యక్షుడిగా వై.కోటేశ్వరరావులను ఎన్నుకున్నారు.

కొబ్బరి అభివృద్ధి బోర్డు బృందం పర్యటన

కవిటి: రాష్ట్రంలో రెండో కోనసీమగా గుర్తింపు పొందిన ఉద్దానం కొబ్బరితోటల్లో పండిన నాణ్యమైన కొబ్బరిని కొత్త మొక్కల తయారీకి తీసుకునేందుకు జాతీయ కొబ్బరి బోర్డు సంసిద్ధంగా ఉందని ఆ సంస్థ వివిధ రాష్ట్రాల డైరెక్టర్లు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కపాసుకుద్ధి, ఆర్‌.భైరిపురం, నెలవంక, సన్యాసిపుట్టుగ గ్రామాల్లోని కొబ్బరితోటలను వారు పరిశీలించారు. ఇక్కడ పండుతున్న కొబ్బరి నాణ్యత ప్రమాణాలు మంచి ఉత్తమ శ్రేణిగా గుర్తింపు పొందాయని తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఎంపిక చేసిన 1 లక్ష టెంకాయలను సేకరించేందుకు క్షేత్రపరిశీలన చేశామని తెలిపారు. ఉద్దానం ప్రాంతంలో సాగవుతున్న కొబ్బరికాయలను చికాఫ్‌ రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటించిన బృందంలో కోకోనట్‌ డవలప్‌మెంట్‌ బోర్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మంజునాథ రెడ్డి, ఒడిశా డిప్యూటీ డైరెక్టర్‌ శరవణ్‌, వేగువాడ ఫామ్‌ డైరెక్టర్‌ రఘోత్తం, కర్ణాటక ఫామ్‌ డైరెక్టర్‌ ధన శేఖర్‌లు ఉన్నారు.

విజయవంతం చేయాలి

గార: విశాఖ డెయిరీ పాలు పోస్తున్న రైతుల డిమాండ్ల పరిష్కారానికి ఏపీ పాల రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న చలో విశాఖ డెయిరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీపీ గొండు రఘురామ్‌ పిలుపునిచ్చారు. సోమవారం అంపోలులో పోస్టర్‌ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ డెయిరీ రైతులకు అందాల్సిన పాల సేకరణ ధర తగ్గించి, సంక్షేమ పథకాలు కొనసాగించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో లీటరుకు రూ.4లు బోనస్‌ ఇవ్వడంతో పాల సేకరణ ధర రూ.40 లు పైబడి ఉంటే, ఈ ప్రభుత్వంలో ధర తగ్గించి రైతుల నడ్డివిరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల దాణా ధరలు పెరిగిన పరిస్థితుల్లో ప్రభుత్వం, కంపెనీ రైతులకు అండగా నిలబడలేదని దుయ్యబట్టారు. పాలరైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, కౌలు రైతుల సంఘం కార్యదర్శి పోలాకి ప్రసాదరావులు మాట్లాడుతూ డెయిరీ అవినీతిపై వేసిన హౌస్‌ కమిటీ విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించాలని కోరారు. పాల సేకరణ ధర పెంచడంతో పాటు ప్రతీ మూడు నెలలకు బోనస్‌ ప్రకటించాలని, పశువులకు ఉచిత బీమా, మందులు, గడ్డి విత్తనాలపై రాయితీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పాముకాటుతో విద్యార్థిని మృతి

నందిగాం: మండలంలోని మొండ్రాయివలసలో ఆదివారం అర్ధరాత్రి పాము కాటు వేయడంతో గ్రామానికి చెందిన సీపాన శ్రీనిధి (10) మృతి చెందింది. వివరాలను పరిశీలిస్తే గ్రామానికి చెందిన సీపాన శివ, పవిత్ర దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రేష్మ, చిన్న కుమార్తె శ్రీనిధి. శ్రీనిధి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి పడుకున్న శ్రీనిధికి అర్ధరాత్రి సమయంలో పాము కాటు వేసింది. కొద్దిసేపటికే శరీరంలో ఇబ్బంది కలగడంతో తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వీరు వేకువజామున టెక్కలి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని సోమవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

నూతన కార్యవర్గం ఎన్నిక 1
1/2

నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక 2
2/2

నూతన కార్యవర్గం ఎన్నిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement