
బకాయిలపై ఆందోళన వద్దు
● జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు
ఎచ్చెర్ల: విద్యార్థులకు విడతలవారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల త్వరలో చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, దీనిపై ఆయా కళాశాలల యాజమాన్యాలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో వర్సిటీలో ప్రత్యేక సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్ఞానభూమి పోర్టల్‌లో వివిధ సాంకేతికపరమైన మార్పులు, విద్యార్థుల బయోమెట్రిక్ పెండింగ్ వంటి సమస్యల వలన ఫీజు బకాయిల మంజూరులో జాప్యం వస్తోందన్నారు.
కోర్సుల నిర్వహణలో కొత్త మార్గదర్శకాలు
వీసీ ఆచార్య కేఆర్ రజనీ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలు, కోర్సుల నిర్వహణలో కొత్త మార్గదర్శకాలు వచ్చాయన్నారు. ఇంటర్న్ షిప్ కాల వ్యవధి తగ్గింపు, క్వాంటమ్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ వంటి నూతన బోధనాంశాలు అమలు జరగనున్నట్లు పేర్కొన్నారు. సీడీసీ డీన్, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.ఉదయభాస్కర్ మాట్లాడుతూ అపార్ ఐటీ నమోదు కార్యక్రమం పూర్తిస్థాయిలో జరిగేలా కళాశాలలు చొరవ తీసుకోవాలని సూచించారు. వివిధ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతీ ఏడాది బయోమెట్రిక్ పరికరాల్లో మార్పులు తెస్తున్నందున పలు సమస్యలకు ఆస్కారం ఏర్పడుతోందన్నారు. 2023 విద్యా సంవత్సరం నుంచి ఏడు విడతలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించి, ఉన్నత విద్య గాడిలో పడేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య, వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ డా.కె.స్వప్న వాహిని, ఎన్‌వో డా.కె.సామ్రాజ్యలక్ష్మీ, యూజీ పరీక్షల డీన్, అసిస్టెంట్ డీన్‌లు డా.జి.పద్మారావు, డా.కె.ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.