
ఒక మెసేజ్‌తో తొలగించేస్తారా..?
● ఉద్దానం తాగునీటి పథకం ఉద్యోగుల తొలగింపుపై ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపాటు
● ఇదేనా అనుభవజ్ఞుని పాలన అంటూ శాసన మండలిలో చర్చ
● తొలగించిన 104 మందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
కవిటి : సుమారు 28 ఏళ్లుగా ఉద్దానం తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికుల తొలగింపు దారుణమని ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. మంగళవారం శాసనమండలి, మీడియా పాయింట్ వేదికగా ఈ సమస్యను ప్రస్తావించారు. ఉద్యో గాలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి అధికారం దక్కాక ఉన్నవి తీసేస్తున్నారని దుయ్యబట్టారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని ఒకే మెసేజ్‌తో రాత్రికి రాత్రి తొలగించడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నా రు. 104 కుటుంబాలు ఆ ఒక్క మెసేజ్‌తో రోడ్డున పడ్డాయన్నారు. తొలగించిన ఆ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకుని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదేనా అనుభవజ్ఞుడి పాలన..?
దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని తొలగించడమే విజనరీయా, ఇదే అనుభవజ్ఞుడి పాలనా అంటూ నర్తు ప్రశ్నించారు. ఉద్యోగాలు కోల్పోయి 45 రోజులుగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆ కార్మికులకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నా రు. జిల్లాలో పదిమంది ఎమ్మెల్యేలు, ఒక ప్రభుత్వ విప్, రాష్ట్ర, కేంద్ర మంత్రి ఉండి ఆ 104 మంది కార్మికులను ఆ దుకోలేరా అని ప్రశ్నించారు. ఆర్‌డబ్ల్యూఎస్ స్కీమ్‌లో ఉన్న వారిని తీసుకువెళ్లి, మెగా సంస్థలో విలీనం చేసి నా లుగు నెలల్లోనే వారిని విధుల్లో నుంచి తొలగించడం అన్యాయమన్నారు.
కార్మికుల తరఫున వైఎస్సార్ సీపీ న్యాయ పోరాటం
ఆ కార్మికుల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ అంశంపై వైఎస్ జగన్ వెంటనే స్పందించి పార్టీ లీగల్ టీమ్ ప్రతినిధి మనోహర్ రెడ్డికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు నర్తు చెప్పారు. ఆ 104 మంది కుటుంబాల భవిష్యత్ కోసం లీగల్‌గా న్యాయపోరాటం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు.
ఉద్యమకారుల ఆవేదన అర్థం చేసుకోండి
థర్మల్ ఉద్యమకారులపై బనాయించిన అక్రమ కేసు లు ఎత్తివేయాలని నర్తు రామారావు కోరారు. విరామ సమయంలో శాసనమండలి ప్రాంగణంలో తనను కలిసిన పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ యారాడ కృష్ణమూర్తిని, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు వద్దకు తీసుకువెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.