
ఉత్సవం.. ఉత్సాహం
● వైభవంగా కొత్తమ్మ తల్లి జాతర ప్రారంభం
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి శతాబ్ది జాతర ఉత్సవాలు మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అమ్మతల్లి గుడిలో ఉన్న అమ్మవారి జంగిడిని అసాదీల కుటుంబీకుల పెద్ద తలపై పెట్టుకుని అమ్మతల్లికి నిలయమైన రెడ్డిక వీధికి చెందిన కమ్మకట్టు చిన్న అప్పలనాయుడు ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వెంట పేరంటాళ్లు వెళ్లారు. సర్పంచ్ కాళ్ల సంజీవరావు, కల్లి విశ్వనాథరెడ్డి తదితరులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ జంగిడిని గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు రెడ్డిక వీధి నుంచి పసుపు కలశాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి మళ్లీ కొత్త మ్మ తల్లి ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించి అమ్మ వారి దండకం చదివి కొత్త చీరను మొక్కుగా చెల్లిస్తారు. జాతర సందర్భంగా ఏర్పా టు చేసిన హెలికాప్టర్ రైడ్‌ను కేంద్ర, రాష్ట్ర మంత్రు లు జెండా ఊపి ప్రారంభించారు. సెంటర్ లైటింగ్ ఆకట్టుకుంది. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పాల్గొన్నారు.
క్రైమ్ బృందాలతో ప్రత్యేక నిఘా
శ్రీకాకుళం క్రైమ్ : కోటబొమ్మాళిలో జరుగుతున్న కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భద్రతా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ మహేశ్వరరెడ్డి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. సుమారు 100 సీసీ కెమెరాలు, 6 డ్రోన్ కెమెరాలు, 10 ఎల్‌ఈడీ తెరలను కంట్రోల్ రూమ్‌నకు అనుసంధానం చేశామన్నారు. పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా తక్షణ ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, తప్పిపోయిన పిల్లలు, వస్తువుల ట్రేసింగ్ కోసం ప్రత్యేక కంట్రోల్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.

ఉత్సవం.. ఉత్సాహం