
పీహెచ్‌సీ ముందు గిరిజన మహిళల ధర్నా
పాతపట్నం: మండలంలోని బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) ముందు వైద్యం అందడం లేదని గిరిజన మహిళలు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. బుధవారం ఉదయం ఆర్.ఎల్.పురం,పెద్ద సున్నాపురం, రామన్నగూడ తదితర గిరిజన గ్రామాలకు చెందిన మహిళలు పీహెచ్‌సీకి చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని తమకు డాక్టర్ వద్దని ఆందోళన చేపట్టారు. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. వేరే ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే డాక్టర్‌ను నియమించి తమకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆటో బోల్తా
నరసన్నపేట: మండలంలోని దేశవానిపేట సమీపంలో పోలాకి రోడ్డులో చీడివలస నుంచి నరసన్నపేటకు వెళ్తున్న ఆటో బుధవారం ఉదయం బోల్తా పడింది. దీంట్లో ప్రయాణిస్తున్న ముగ్గురుకి గాయాలయ్యాయి. బాగా గాయపడిన చీడివలసకు చెందిన కాల జ్యోతిని 108లో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటో అదుపు తప్పడంతో బోల్తాపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది.
వీధి కుక్కల దాడిలో
నలుగురికి గాయాలు
మందస: మండల కేంద్రంలో వీధి కుక్కల దాడిలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. బుధవారం గుంపుగా వెళ్లి దాడిచేసి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులకు కాటు వేశాయి. దీంతో వీరికి మందస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పీహెచ్‌సీ ముందు గిరిజన మహిళల ధర్నా