
గంజాయితో ఇద్దరు యువకులు అరెస్టు
ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఎల్‌సీ గేట్ వద్ద 11 కేజీల గంజాయితో ఇద్దరు యువకులను మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు సీఐ కార్యాలయం ఆవరణలో పత్రికా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే ఎల్‌సీగేట్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. తమిళనాడుకి చెందిన కదాశిమ ముత్తుకుమార్, కపిల్‌దేవ్ మరియప్పన్ 11.120 కేజీల గంజాయితో పట్టుబడినట్లు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం తుత్తుకొడి పట్టణానికి చెందిన వీరిద్దరూ.. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒడిశాకి చెందిన గంజాయి వ్యాపారి మణిక్ సబర్ వద్ద తక్కువ రేటుకి గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం ఒడిశా నుంచి బస్సు ద్వారా ఇచ్ఛాపురం చేరుకున్నారు. అక్కడ నుంచి రైలు మార్గం ద్వారా తమిళనాడుకి వెళ్లేందుకు గంజాయిని తీసుకెళ్తుండగా ఎల్‌సీగేట్ వద్ద రూరల్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.