
కొడుకును భయపెట్టాలని..!
కొత్తూరు: తాను చెప్పిన మాటలు కుమారుడు వినకపోవడంతో అతడిని భయపెట్టాలని చూసి జుట్టుకు రాసుకునే నూనె తాగి తల్లి త్రివేణి మృతి చెందిన ఘటన కొత్తూరు మండలం గూనభద్ర కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, భర్త చెప్పిన వివరాల మేరకు.. గూనభద్ర కాలనీకి చెందిన త్రివేణి, సత్యనారాయణలు దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఒక కుమారుడు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకపోవడంతో కొడుకును బెదిరించాలన్న ఆలోచనతో తల్లి త్రివేణి ఇంట్లో ఉన్నటువంటి తలకు రాసుకునే నూనె ఈనెల 11వ తేదీన సేవించింది. విషయం తెలుసుకున్న భర్త వెంటనే త్రివేణిని స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో త్రివేణి వైద్యం పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎండీ అమీర్ ఆలీ తెలిపారు. భర్త సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.