
కొనసాగుతున్న యూరియా కష్టాలు
పాతపట్నం/కంచిలి: యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బుధవారం పాతపట్నం మండల కేంద్రంలోని ఇద్దరు ప్రైవేటు డీలర్లకు యూరియా వచ్చిందని తెలియడంతో ఒక్కసారిగా రైతులు చేరుకుని బారులు తీరారు. 1,100 (50 మెట్రిక్ టన్నులు) యూరియా బస్తాలు వచ్చాయని, టోకెన్ ద్వారా యూరియా అందజేస్తున్నామని ఏవో పి.కిరణ్‌వాణి, ఏఈవో టి.భారతి తెలిపారు. మరోవైపు, ఎరువులకు సంబంధించిన టోకెన్ల కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. కంచిలి మండలం జలంత్రకోట గ్రామ సచివాలయం వద్ద బుధవారం టోకెన్ల కోసం రైతులు ఎగబడ్డారు. ఇక్కడ ఎరువులు రాకుండానే, ముందస్తుగా టోకెన్లు పంపిణీ చేస్తుండటం గమనార్హం.