
ఆశలపై నీరు.. రైతన్నకు కన్నీరు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శివారుకు అందని సాగునీరు, పూడికలు తీయని కాలువలు, ఆధునికీకరణకు నోచుకోని ప్రాజెక్టులు.. జిల్లాలో సాగునీటి నిర్వహ ణ తీరు ఇది. పాలకుల నిర్లక్ష్యానికి తోడు సిబ్బంది కొరత కూడా సాగునీటి నిర్వహణకు శాపంలా మారింది. జిల్లాలో సాగునీటి వనరుల సద్వినియోగానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వంశధార ఫేజ్–2, స్టేజ్–2 పనులు చేసేందుకు శ్రీకారం చుట్టారు. పనులు వేగంగా జరిగేందుకు బీఆర్‌ఆర్ వంశధార సర్కిల్, ఇరిగేషన్ సర్కిల్స్‌ని ఏర్పాటుచేసి దానికి ఎస్‌ఈలను నియమించారు. వీరు ప్రాజెక్టుల పనులను పరిశీలించడంతో పాటు పలు పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అప్పగించాలి. శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి డివిజన్లలలో ఉండే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈలు, ఏఈలు, జేఈలతో పాటు అటెండర్లు, లస్కర్లను పర్యవేక్షించే బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. కానీ ఇక్కడ రెగ్యులర్ ప్రాతిపదికన ఎస్‌ఈ పనిచేయడం అన్నది దాదాపు అసాధ్యమైపోయింది. ఎవరూ పట్టుమని పదిరోజులు కూడా ఉండడం లేదు. నిరంతరం వంశధార సర్కిల్ ఎస్‌ఈ గది, కుర్చీ ఖాళీగానే దర్శనం ఇస్తుండడం గమనార్హం.
సర్కిల్ ఎస్‌ఈని నియమించరా..?
జిల్లాలో వంశధార సర్కిల్ ఎస్‌ఈగా పనిచేసిన డోల తిరుమలరావును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షసాధింపు చర్యలో భాగంగా వేరే జిల్లాకు బదిలీ చేశారు. ఆ తర్వాత వంశధార సర్కిల్‌లో డిప్యూటీ ఎస్‌ఈగా ఉన్న స్వర్ణకుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్నాళ్లు విధు లు నిర్వహించిన అనంతరం టెక్కలి నియోజకవర్గానికి చెందిన ఇంజినీర్ తిరుపతిరావును రిటైర్‌మెంట్‌కి ముందు మూన్నాళ్ల ముచ్చటగా తీసుకొచ్చారు. ఆయన మేలో రిటైరయ్యారు. ఆ తర్వాత స్వర్ణకుమార్‌కి మళ్లీ బాధ్యతలు అప్పగించారు. ఆయన టీటీపీఆర్ ఎస్‌ఈగా పదోన్నతిపై వెళ్లిపోయారు. అయినప్పటికి మళ్లీ వదలకుండా ఆయనకే వంశధా ర ఎస్‌ఈగా, నార్త్‌కోస్ట్ సీఈగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. దీంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీ కాకుళం మూడుచోట్ల తిరగలేక మెడికల్ లీవ్‌పై మూ డు నెలలు వెళ్లిపోయారు. అప్పుడు ఏకంగా రాజమండ్రిలోగల ధవళేశ్వరం ప్రాజెక్టు సర్కిల్ ఎస్‌ఈగా ఉన్న కర్నా శ్రీనివాసరావుకి అదనపు బాధ్యతలు అప్పగించారు. 350 కిలోమీటర్ల దూరం నుంచి వ చ్చే సరికే సాయంత్రం అయిపోతోంది. పనులు పరిశీలించడం, ఫైల్స్ చూడడం అసాధ్యమైపోతోంది.
ఇక్కడ అర్హులే లేరా..?
జిల్లాలో ఎంతోమంది సీనియర్ ఇంజినీర్లు ఉన్నా వారందరినీ వదిలేసి ఎక్కడో ఉన్న ధవళేశ్వరం ఈ ఈకి వంశధార ఎస్‌ఈగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంపై ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లా ఇంజినీర్లు మండిపడుతున్నారు. అత్యవసరమైతే కింది స్థాయి సిబ్బంది, కాంట్రాక్టర్లు ఫైల్స్ తీసుకుని ధవళేశ్వరం పరుగులు పెట్టాల్సి వస్తోందని అంటున్నారు. సరైన పర్యవేక్షణ లేక పలాస, వజ్రపుకొత్తూరు, సోంపేట, గార, శ్రీకాకుళం రూరల్ మండలాలకు నీరివ్వ లేకపోతున్నారు.
రెగ్యులర్ వంశధార ఎస్‌ఈని నియమించేదెప్పుడో..?
ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ లేక ఇబ్బందులు
ఇంజినీర్లు లేక జిల్లా రైతులకు సాగునీరు కరువు