
బడ్జెట్ ఖర్చులపై కలెక్టర్ ఆరా
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో కీలక అధికారి తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగ వర్గాల కలహాలతో పాటు పలు ప్రొగ్రాంల కింద మంజూరైన బడ్జెట్ నిధుల స్వాహా యత్నాలపై ఈనెల 11న ‘సాక్షి’లో ‘కలహాల కాపురం..నిధుల భోజనం’ పేరిట ప్రచురించిన కథనంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ మే రకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పందిస్తూ.. బడ్జెట్ ఖర్చులపై ఆరా తీసినట్లుగా సమాచారం. దీంతో పాటు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగుల వర్గ విబేధాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ కథనం అనంతర పరిణామాలపై కూడా కలెక్టర్ ఆరా తీస్తున్నట్లుగా తెలిసింది. ఈ నెల 11నే జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఆయా ప్రొగ్రాం అధికారులతో సమీక్షించారు. అసలు బడ్జెట్ ఖర్చుల విషయాలు బహిర్గతం కావడంపై ఆమె పలువురిపై అనుమానాలను వ్యక్తం చేశారు.
‘మెడికల్ కాలేజీలపై చర్చ జరగాలి’
పోలాకి (నరసన్నపేట): ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలల నిర్మాణం విషయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప సంకల్పంతో ముందుకెళ్తే, ప్రస్తుత సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేటు దళారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందన్నారు. దీనిపై అన్ని వర్గాల్లోనూ చర్చ జరగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే మీడియాపై కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే.. ప్రజల గొంతు మూయించినట్టేనని తెలిపారు.
సచివాలయం అద్దాలు ధ్వంసం
కొత్తూరు: మెట్టూరు బిట్–2 ఆర్‌ఆర్ కాలనీ గ్రామ సచివాలయ భవనం అద్దాలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలుగొట్టారు. ఈ పనిని ఆకతాయిలు చేశారా, లేదా ఎవరైనా దొంగలు చేశారా అన్నది తెలియాల్సి ఉంది. అద్దాలు పగలు గొట్టినట్లు ఆదివారం ఎంపీడీఓ నీరజకు సర్పంచ్ యర్లంకి ధర్మారావు ఫిర్యాదు చేశారు. ఆదివారం పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ఇంకా ఫిర్యాదు చేయలేదని సర్పంచ్ తెలిపారు.
గణతంత్ర పరేడ్‌కు నేడు ఎంపికలు
ఎచ్చెర్ల: జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో పాల్గొనే వలంటీర్ల ఎంపిక సోమవారం బీఆర్‌ఏయూలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ జి.వనజ తెలిపారు. ఈ ఎంపికలు ఎన్‌ఎస్‌ఎస్ స్టేట్‌యూత్ అధికారి సైదారమావత్ ఆద్వర్యంలో జరుగుతాయని తెలిపారు.

బడ్జెట్ ఖర్చులపై కలెక్టర్ ఆరా