
కూటమిలో కొండంత
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కూటమి నేతల మధ్య రాజకీయం రచ్చకెక్కుతోంది. గ్రావెల్ కొండ కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు, అనుచరులు పట్టుబడుతుండడంతో వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. రణస్థలం మండలం సంచాం కొండపై గ్రావెల్ తవ్వకాల విషయంలో గత ఎనిమిది నెలలుగా అంతర్గత పోరు జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా తవ్వకాలు జరిపిన యంత్రాలపై ఓ వర్గం గొడవకు దిగింది. అనుమతులు ఉన్నా స్థానికుల అభ్యంతరాలు ఉన్నాయని, తవ్వకాలు జరపడానికి వీల్లేదని ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ అనుచరులు పొక్లెయినర్ ధ్వంసం చేసి, అందులో ఉండాల్సిన రెండు బ్యాటరీలు, కొన్ని కేబుళ్లు పీకేయడమే కాకుండా మార్గం మధ్యలో రాకపోకలు సాగకుండా పెద్ద గుంత తీశారంటూ అసలు లీజుదారుడు, సబ్ లీజు దారుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రణస్థలం మండలంలోని సంచాం కొండలోని గ్రావెల్ తవ్వకాల కోసం గత కొన్ని నెలలుగా బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు అండ్‌కో, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అండ్ కో మధ్య వివాదం నలుగుతోంది. సంచాం రెవెన్యూ పరిధిలోని 89/6లో గుండు కై లాష్ పేరున 7 ఎకరాల గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. కై లాష్ పేరు మీద అనుమతులు ఉన్నప్పటికీ వారి బంధువు లంకలపల్లి శంకరరావు నిర్వహణ చేస్తూ వస్తున్నారు. అయితే, లీజు తవ్వకాల నిర్వహణను తమకు ఇవ్వాలని ఎన్‌ఈఆర్ అండ్‌కో గత కొంతకాలంగా అడుగుతోంది. కానీ, వారి మధ్య ఆర్థిక పరమైన అంగీకారం కుదరకపోవడంతో వ్యవహరం చెడింది. ఇదే సమయంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోదరుడి కుమారుడు రాజేష్‌తో లీజు దారుడికి ఆర్థిక పరమైన ఒప్పందం జరిగింది.
గతంలో అనధికార తవ్వకాల వివాదం..
సంచాం కొండపై అక్రమ తవ్వకాలు పరిపాటిగా మారిపోయాయి. అక్కడున్న గ్రావెల్‌ను అక్రమంగా తరలించుకుని పోతున్నారు. ఇదంతా అనధికారికమే. ఓ ఎమ్మెల్యే రాత్రి పగలు ఇక్కడ తవ్వకాలు జరిపి వందల లోడ్లు తరలించి తన ఇల్లు, స్కూల్ ప్రాంగణాలను సరిచేసుకున్నారు. అప్పట్లో గొడవ కూడా జరిగింది. అక్రమంగా తరలిస్తున్న లారీలను స్థానికులు పట్టుకున్నారు. కానీ పట్టుకున్న వారిని బెదిరించి, వేధింపులకు గురి చేయడంతో అక్రమం కాస్త సక్రమమైంది. ఆ తర్వాత కూడా వేలాది లోడ్లు ఆ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే తరలించారు.
తాజాగా అధికారిక తవ్వకాల గొడవ..
కొండపై పొక్లెయిన్, లారీలను పెట్టి బుధవారం పనులు ప్రారంభించారు. రాత్రి 7 గంటలకు వరకు పనులు చేసి, ముగించుకుని పొక్లెయినర్‌ను కొండపైన వదిలేసి వెళ్లిపోయారు. గురువారం ఉదయం డ్రైవర్ వచ్చి చూసేసరికి పొక్లెయినర్ అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉండాల్సిన రెండు బ్యాటరీలు, కొన్ని కేబుళ్లు కనిపించలేదు. సమాచారం తెలుసుకున్న లీజుదారులు వచ్చి పరిసరాలు పరిశీలించారు. మార్గమధ్యంలో రాకపోకలు సాగకుండా పెద్ద గుంత తీసి ఉందని, పొక్లెయినర్ ధ్వంసం చేశారని ఇదంతా ఎమ్మెల్యే అనుచరులే చేశారని ఆరోపించారు. గొడవ పెద్దది కావడంతో ప్రత్యేక ఎస్టీఎఫ్ బలగాలతో పాటు, జేఆర్ పురం, లావేరు ఎస్‌ఐలు ఎస్.చిరంజీవి, జి.లక్ష్మణరావు, పోలీస్ సిబ్బంది భారీగా చేరుకున్నారు. కొంత సమయం తర్వాత తహసీల్దార్ వచ్చారు. ఇక్కడ తవ్వకాలకు అనుమతులు ఉన్నా స్థానిక గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తవ్వకాలు జరపరాదని, ఈ అంశంపై గత తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు నవంబర్ 2024లో భూగర్భ గనుల శాఖ అధికారులకు లేఖ రాశారని, ఆ లేఖపై ఇంకా ఎలాంటి వివరణ రానందున తవ్వకాలు నిలిపివేయాలని లీజుదారుడికి పోలీసుల సమక్షంలో చెప్పేశారు.
ఎన్‌ఈఆర్ అనుచరులు వర్సెస్
కూన అనుచరులు
రణస్థలం మండలం సంచాం కొండపై గ్రావెల్ గొడవ
అనుమతుల లీజు కోసం పోరు
ఆర్థిక వ్యవహారాల ఒప్పందం మేరకు దక్కించుకున్న కూన రవికుమార్
అండ్ కో
తమకు ఇవ్వలేదన్న ఆవేదనలో ఎన్‌ఈఆర్ అండ్ కో
రచ్చకెక్కుతున్న వ్యవహారం

కూటమిలో కొండంత