
విద్యుత్ షాక్‌తో వ్యక్తికి తీవ్ర గాయాలు
మెళియాపుట్టి : మారడికోట పంచాయతీ సవర చీడిపాలెం గ్రామంలో గురువారం విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. సవర భాస్కరరావు తన ఇంటి మేడపైకి వెళ్లి కరెంట్ తీగలను కదపడంతో షాక్‌కు గురై హైటెన్షన్ వైర్లకు అతుక్కుపోయాడు.వెంటనే గ్రామస్తులు ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి సరఫరా నిలిపివేయడంతో కింద పడిపోయాడు. బాధితుడిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌లోచేర్పించారు. అయితే కరెంట్ తీగలను ఎందుకు కదపడానికి వెళ్లాడు అనే దానిపై స్పష్టత లేదు. భాస్కరరావు భార్య మూడేళ్ల కిందటే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బైక్ నుంచి జారిపడి మహిళ మృతి
ఎచ్చెర్ల: సంతసీతారాంపురం సమీపంలో గురువారం జరిగిన ప్రమాదంలో రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన బస్వ పార్వతి (49) మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్న పార్వతి తన కుమారుడు రామిరెడ్డితో కలసి ద్విచక్రవాహనంపై బుడగట్లపాలెం–సంతసీతారాంపురం మీదుగా రిమ్స్ ఆస్పత్రికి బయలుదేరింది. బైక్ వెనుక కూర్చున్న పార్వతికి ఒక్కసారిగా కళ్లు తిరగడంతో కుమారుడిని గట్టిగా పట్టుకుంది. ఈ సమయంలో బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పార్వతిని 108 అంబులెన్సులో రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వల్పగాయాలతో బయటపడిన రామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ–2 అప్పలరాజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.