
పంట పొలంలో గుర్తు తెలియని మృతదేహం
శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రి దాటాక గూడేం వెళ్లే దారిలో వైన్‌షాప్ ఎదురుగా పంట పొలాల్లో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. నీలం వైట్ చెక్స్ టీషర్టు, నలుపు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. శరీరంపై గాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతిచెంది సుమారు వారం గడిచి ఉంటుందని భావిస్తున్నారు. దుర్వాసన వెదజల్లుతూ గుర్తు పట్టలేని విధంగా మారింది. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ పైడపునాయుడు, సిబ్బంది, క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలిస్తే శ్రీకాకుళం రూరల్ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ రాము కోరారు.
బంగారు వ్యాపారి అంటూ పుకార్లు..
గుర్తు తెలియని మృతదేహాన్ని చూసిన స్థానికులు ఇటీవల నరసన్నపేటలో అదృశ్యమైన ఓ బంగారు వ్యాపారిగా భావించడం కలకలం రేపింది. వెంటనే రూరల్ పోలీసులు నరసన్నపేట పోలీసులతో పాటు కుటుంబ సభ్యులను సంప్రదించగా వారు వచ్చి చూసి వ్యాపారి మృతదేహం కాదని నిర్ధారణ చేశారు.