
భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..!
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలు
అప్రమత్తంగా లేకుంటే ఖాతాలు ఖాళీ
అత్యాశే కారణం
శ్రీకాకుళం క్రైమ్: పెరుగుతున్న సాంకేతికతతో పాటు రోజురోజుకీ సైబర్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. రోజుకో మోసంతో సైబరాసురులు రూ.కోట్లలో భారీగా సొమ్ము కొల్లగొడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు పట్టిపీడించిన ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలే ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ప్రముఖ వైద్యులు, ఉపాధ్యాయ, రాజకీయ, వ్యాపారవర్గాలు, ఇంజినీర్లు సైతం సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని దారుణంగా మోసపోతున్నారు. మోసపోయాక పరువు పోతుందేమోనని కొందరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోయినా.. మరికొందరు భారీ అమౌంట్లు కావడంతో నేరుగా జిల్లా ఉన్నతాధికారి వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ లెక్కకు మించి సైబర్ కేసులు వివిధ స్టేషన్లలో పెండింగ్‌లోనే ఉంటున్నాయి. మరికొన్ని స్టేషన్లలో అయితే కనీసం కేసు కట్టడానికి సాహసించలేని స్థితిలో ఉండడం గమనార్హం.
నమ్మారో.. నట్టేటా మునిగినట్లే..
● శ్రీకాకుళం సబ్ డివిజన్ కేంద్రంగా ఇటీవల ఒక ప్రముఖ వైద్యుడు ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట రూ.37.50 లక్షలు మోసపోయాడు. ఎప్పటినుంచో స్టాక్ మార్కెట్‌లోనే కాకుండా వివిధ మార్గాల్లో ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తున్న ఆ వైద్యుడికి ఒక ఆపరిచిత వ్యక్తి వాట్సాప్ కాల్‌చేసి చిట్కాలు చెబుతాననడంతో సరే అన్నాడు. ముందుగా ఓ గ్రూపు క్రియేట్ చేసి అందులో సభ్యులను పరిచయం చేశాడు. రూ.10 లక్షలు పెడితే అదనంగా మరో రూ.10 లక్షలు వస్తుందని, రూ.20 లక్షలు పెడితే రూ.20 లక్షలు, రూ.30 లక్షలు పెడితే రూ.30 లక్షలు వస్తుందని మాయమాటలు చెప్పాడు. తన చిట్కాల ద్వారా గ్రూపులో సభ్యులకొస్తున్న అమౌంట్ స్క్రీన్‌షాట్లు తీసి వైద్యుడికి పెట్టసాగాడు. నమ్మకం కుదిరాక వైద్యుడు పలుమార్లు రూ.2 లక్షలు, రూ.3 లక్షలు.. ఇలా వేస్తూనే ఉన్నాడు.. విత్‌డ్రా ఆప్షన్‌లో డబ్బులు అదనంగా కనిపిస్తుండడం తన అకౌంట్‌లో యాడ్ అవుతున్నట్లు ఆశ పుట్టింది. అలా ఒక రూ.15 లక్షల వరకు వేశాడు. డబ్బులైతే ఆప్షన్‌లో కనిపించి విత్ డ్రా అవ్వకపోవడంతో అపరిచిత వ్యక్తిని అడగగా.. మీరు కడుతుంటే ఒకేసారి వస్తాయనడంతో రూ.37 లక్షల వరకు కట్టేశాడు. కానీ అప్పటికీ విత్ డ్రా అవ్వకపోవడంతో పాటు అపరిచిత వ్యక్తికి ఫోన్‌చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. గ్రూపులో కూడా వైద్యుడిని రిమూవ్‌వ్ చేసేశారు. ఇక చేసేదేమీలేక వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు.
● ఇదే తరహాలో కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఆర్మీకి చెందిన ఒక వ్యక్తి రూ.కోటికి పైగా సైబరాసురుల చేతిలో నష్టపోయానని ఫిర్యాదు చేయడంతో భారీ అమౌంట్ కావడంతో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా.. ఇప్పటివరకు కేసు అయితే నమోదు చేయలేకపోయారు.
● రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన దుంప కృష్ణ చిత్తూరు జిల్లా మెట్టూరు ఎస్‌బీఐలో ఒప్పంద ఉద్యోగిగా చేస్తున్నాడు. వాట్సాప్ ద్వారా వచ్చే వీడియోలు చూసి సబ్‌స్క్రైబ్ చేసుకున్న కృష్ణకు సైబర్ కేటుగాళ్లు టెలిగ్రామ్ ద్వారా లింకులు పంపించి గేమ్‌లు ఆడించారు. బహుమతులు, డబ్బులొస్తున్నట్లు ఆన్‌లైన్‌లో చూపించడంతో కృష్ణ రూ.11.50 లక్షల వరకు ట్రేడింగ్ చేశాడు. చివరికి డబ్బులు ఎంతకీ అకౌంట్‌లో పడకపోవడంతో జేఆర్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో అఫైర్ నమోదు చేసి చిత్తూరు జిల్లా మెట్టూరుకు కేసు బదిలీ చేశారు.
కేసులు నమోదు చేయలేని దుస్థితి
ఈ తరహానే కాకుండా వివిధ సైబర్ మోసాలపై జిల్లాలో భారీస్థాయిలో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో స్టేషన్‌లో 4 నుంచి 6 వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మోసం చేసే కేటుగాళ్లు వివిధ రాష్ట్రాలు, దేశాలు వారు కావడంతో అక్కడికి వెళ్లి ఆ అధికారులతో సమన్వయం చేసుకుని నోటీసులిచ్చేవరకే చేయగలుగుతున్నారు. ఈలోగా దారి ఖర్చులు, వసతి ఖర్చులు అన్నీ వీరిపైనే భారంగా పడుతున్నాయి. పోనీ కోర్టు వరకు నేరస్తులు వస్తున్నారంటే అదీ లేదు. ఒకట్రెండు సార్లు వచ్చీ ఆ తర్వాత వారి జాడే కనిపించనంతగా మాయమవుతున్నారు. దీంతో ఇటువంటి కేసులు కట్టాలంటేనే తమకు తలనొప్పిగా మారుతున్నాయంటూ కొంతమంది పోలీసు అధికారులే చెబుతుండడం శోచనీయం.
ప్రస్తుతం సైబర్ నేరాలు జిల్లాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రజలు అత్యాశతో వారి వలలో పడుతున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టు వంటి మోసాలకు ఎక్కువగా చదువుకున్నవారే బలవుతున్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో గతంలో కంటే ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదు చేస్తున్నాం. క్షణాల్లో సైబర్ సెల్ నంబర్ 1930కు ఫిర్యాదు చేసి పోలీసులను, బ్యాంకు ప్రతినిధులను సంప్రదిస్తే మంచిది.
– డీఎస్పీ వివేకానంద, శ్రీకాకుళం

భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..!