
అండర్ పాసేజ్‌తో అవస్థలు
రోడ్డెక్కిన కవిటి అగ్రహారం గ్రామస్తులు
రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
పాఠశాల విద్యార్థులతో రైల్వే ట్రాక్ వద్ద ధర్నా
వజ్రపుకొత్తూరు: నందిగాం మండలంలోని కవిటి అగ్రహారం గ్రామానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అండర్ పాసేజ్‌లోకి వరద నీరు ఆరు అడుగుల మేర చేరిపోవడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు స్థానిక రైల్వే ట్రాక్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. తమ గ్రామానికి వెళ్లేందుకు పాత లెవిల్ క్రాసింగ్ రహదారిని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. రైల్వేశాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అండర్ పాసేజ్ నిర్మాణం పూర్తిగా ఫెయిల్ అయిందని, ముందుచూపు లేకుండా నిర్మించారని మండిపడ్డారు. వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితి ఉంటోందని, చిన్నపాటి వర్షానికే అండర్ పాసేజ్ నిండిపోయి రాకపోకలు నిలిచిపోవడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలకు రైలు ట్రాక్ దాటి చిన్నారులు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని, దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు, రైల్వే శాఖ అధికారులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి వచ్చి గ్రామస్తులతో చర్చలు జరిపారు. మూడు రోజుల్లో సమస్య పరిస్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. పెద్ద మోటార్లు తీసుకొచ్చి అండర్ పాసేజ్‌లో నీటిని తోడే ప్రయత్నాలు రైల్వేశాఖ అధికారులు ముమ్మరం చేశారు.

అండర్ పాసేజ్‌తో అవస్థలు

అండర్ పాసేజ్‌తో అవస్థలు