
పెళ్లీడొచ్చింది... లక్ష్యం ఏమైంది..!
41,821 మంది లబ్ధిదారులు
● నిరుపయోగంగా బాలికా సంరక్షణ పథకం
● బాండ్లు ఉన్నా నిధులు అందని వైనం
● మార్గదర్శకాలు లేకపోవడంతో అధికారుల మౌనం
హిరమండలం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బాలికా సంరక్షణ పథకం అమలుపై అయోమయం నెలకొంది. బాలికల తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు అప్పట్లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎవరికై నా బాలిక ఉంటే వారికి పాసుపుస్తకం జారీ చేసి 21 ఏళ్లు నిండాక నగదు చెల్లించాలని పథకంలో భాగంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేసి పేద కుటుంబంలో ఒక్కరే బాలిక ఉంటే 20 ఏళ్లు వచ్చిన తర్వాత వివాహ ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఇస్తామని, ఇద్దరుంటే ఒక్కొక్కరికీ రూ.30 వేలు చొప్పున అందజేస్తామని ప్రకటించింది. అందుకుగాను అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అర్హులను ఎంపిక చేసి ఎల్‌ఐసీ బాండ్లు జారీ చేసింది. అయితే నిబంధనల మేరకు పేర్లు నమోదు చేసుకుని అప్పట్లో బాండ్లు పొందినవారికి, ప్రస్తుతం 20 ఏళ్లు పూర్తవుతున్నా నేటికీ డబ్బులు అందకపోవడంతో పలువురు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఆది నుంచి గందరగోళమే
ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన ఈ పథకం పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఈ పథకం అమలు తీరు ప్రారంభం నుంచి అయోమయంగానే ఉండేది. బాండ్లు జారీ అయ్యాక తొలుత లబ్ధిదారులు ఎవరికి వారే డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. కొన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో మాత్రమే ఈ ప్రక్రియ జరిగింది. బాండ్లు అందడంలో పలు ఆటంకాలు ఏర్పడ్డాయి. 2005 నుంచి 2007 సంవత్సరాల్లో బాండ్లు పొందిన 4,880 మందికి మెచ్యూరిటీ తేదీ పూర్తయ్యి చాలాకాలమవుతున్నా ఇప్పటికీ స్పష్టత లేదు. ఎల్‌ఐసీ జారీ చేసిన బాండ్లును నగదుగా ఎలా మార్చుకోవాలో ఎవరికీ తెలియక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2007 తర్వాత ఈ పథకం గురించి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో లబ్ధిదారులకు ఎలా బదులివ్వాలనేది అధికారులకూ తెలియడం లేదు.
లబ్ధిదారులు బాండ్లును ఎలా పొందాలో ప్రాజెక్టుల వారీగా తెలియజేస్తాం. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గడువు ముగిసిన బాండ్లును నగదుగా ఎలా మార్చుకోవాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
– ఐ.విమల, ఐసీడీఎస్ పీడీ శ్రీకాకుళం
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 41,821 మందిని అర్హులుగా అప్పట్లో అధికారులు గుర్తించారు. వీరిలో 26,935 మందికి గతంలో బాండ్లు అందించినట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో చాలామంది లబ్ధిదారుల ఆడపిల్లలు ఇప్పుడు పెళ్లీడుకొచ్చారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట ఉన్నబాండ్ పత్రాలు తీసుకుని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. అయినా వారి నుంచి సరైన సమాధానం ఉండటం లేదు. డబ్బులు చెల్లింపునకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని చెబుతున్నారు.

పెళ్లీడొచ్చింది... లక్ష్యం ఏమైంది..!